ఇంటర్నెట్, టీవీ, టెలిఫోన్ సేవలను ఫైబర్ గ్రిడ్ ద్వారా అందించేందుకు ప్రత్యేక సెట్ టాప్ బాక్సులు అవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సేవలను రూ. 149కే అందించడాన్ని ప్రారంభించినా, సెట్‌టాప్ బాక్సులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. వీటి తయారీలో అగ్రగామి అయిన కొరియా సంస్థ డాసన్ నెట్వర్క్ సొల్యూషన్స్ సహకారంతో తిరుపతిలో యూనిట్ నెలకొల్పేందుకు సెల్ కాన్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. దేశంలో తొలిసారి ఫైబర్‌గ్రిడ్ విధానాన్ని అతి తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం.. అందుకు అవసరమయ్యే సకల సదుపాయాల కల్పనకు స్థానిక పరిశ్రమలకు అవకాశం కల్పిస్తోంది. దేశంలో మొదటిసారిగా సెట్ టాప్ బాక్స్‌ల తయారీ తిరుపతిలో జరగబోతోంది.
ఇళ్లకు ఫైబర్ గ్రిడ్ నుంచి కనెక్షన్లు ఇవ్వాలంటే గిగా బైట్ ప్యాసివ్ ఆప్టికల్ నెట్ వర్క్ సాంకేతికత గల సెట్ టాప్ బాక్సులు అవసరం. ప్రస్తుతం ఇవి చైనా, కొరియాల్లో తయారవుతున్నాయి. డాసన్ నెట్వర్క్ సొల్యూ షన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వీటిని తిరుపతిలో తయారు చేసేందుకు సెల్ కాన్ సంస్థ ఆసక్తి చూపుతోంది. రూ. 250 కోట్ల పెట్టుబడితో స్థాపించే పరిశ్రమలో, నెలకు సుమారు 5 లక్షల సెట్ టాప్ బాక్సులు తయారు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ కే ఇలాంటి సెట్ టాప్ బాక్సులు కోటి వరకు అవసరమవుతా యని, మున్ముందు మిగిలిన రాష్ట్రాలు కూడా ఫైబర్ గ్రిడ్ సేవలు అందించినపుడు, అక్కడా జి-పీవోఎన్ బాక్సులకు గిరాకీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు 10 శాతం సుంకం పడుతోంది. ఇక్కడే తయారైతే ఆ భారం ఉండదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. దేశంలో జి-పీవోఎస్ సెట్ టాప్ బాక్సులు ఎక్కడా ఉత్పత్తి చేయట్లేదు. అందుకే కొరియా దిగ్గజ సంస్థ డాసన్ నెట్‌వర్క్‌తో ఒప్పందం చేసుకున్నామని, సెట్ టాప్ బాక్సుల తయారీ పై ఆ సంస్థ మా సిబ్బంది 50 మందికి శిక్షణ ఇచ్చిందని. ఇప్పటికే సెల్ ఫోన్ కంపెనీ ఉన్నందున, అదనపు పరికరాలు సమకూర్చుకుని, మార్చిలో వీటి ఉత్పత్తి ప్రారంభించనున్నామని, సెల్ కాన్ ప్రతినిధులు చెప్పారు..