దిల్లీలో అరుణ్ జైట్లీ మీడియా సమావేశం తర్వాత అమరావతిలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ మీడియా సమావేశాన్ని యనమల, ఇంకొందరు ముఖ్య నేతలతో కలిసి వీక్షించిన చంద్రబాబు, అసహనానికి గురైనట్టు సమాచారం. జైట్లీ మళ్లీ చెప్పిందే చెప్పారని, విభజన బిల్లులో పేర్కొన్నవి అడుగుతున్నప్పుడు చేయలేమని చెబుతున్నారని సీఎం అక్కడ ఉన్న నేతలతో అన్నట్టు తెలుస్తోంది. నిధుల విషయంలో సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకోవడం కుదరదని కూడా జైట్లీ అన్నారు. ఈ విషయంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
జైట్లీ చేసిన వ్యాఖ్యలపై, తాము కేంద్ర ప్రభుత్వంతో ఇకపై పోరాడే తీరు పై వివరించడానికి చంద్రబాబు నాయుడు కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వెంటనే సచివాలయానికి రావాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు... కాల్వ శ్రీనివాసులు, నారాయణ చంద్రబాబుతో భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల డిమాండ్లపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేయడంపై చంద్రబాబు మరి కాసేపట్లో స్పందించనున్నారు. బీజేపీతో తమ పార్టీ మిత్రత్వం కొనసాగించే అంశం పై చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబు నిర్ణయం తీసుకొంటారా, లేక పోలిట్ బ్యూరో మీటింగ్, క్యాబినెట్ మీటింగ్ పెట్టిన తరువాత నిర్ణయం ప్రకటిస్తారా అనేది చూడాలి... ముందుగా, సీఎం సమావేశం 7.30గంటలకు ఉన్నప్పటికీ దాన్ని 8గంటలకు వాయిదా వేశారు. అది మరింత ఆలస్యం కూడా అవ్వచ్చు అంటున్నారు... ఈ ప్రెస్ మీట్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.