నూతన అసెంబ్లీలో రెండోసారి సమావేశాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చంద్రబాబు సభలో ప్రసంగించారు. రైతుల దయ వల్లే అమరావతిలో అసెంబ్లీ నిర్వహించుకుంటున్నామని.. రూ.40వేల కోట్ల విలువైన 34వేల ఎకరాల భూమిని ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే సందర్భంలో విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చెయ్యకుండా, ఎదురు రాష్ట్రము పై ఎలా బీజేపీ ఎదురు దాడి చేస్తుందో చంద్రబాబు చెప్పారు... ఏపీకి రావాల్సిన రెవెన్యూ లోటు నిధులను ఇచ్చేశామని చెప్పారని... గట్టిగా అడిగితే లెక్కలు ఇవ్వలేదని అంటున్నారని చంద్రబాబు విమర్శించారు...
కాగ్ నివేదిక ప్రకారం లోటును భర్తీ చేయాలని మళ్లీ కోరుతున్నానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రూ. 13000 కోట్లు ఖర్చయితే... కేంద్ర నుంచి ఇప్పటి వరకు కేవలం రూ. 5,349 కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు మెత్తం ఖర్చు కేంద్రమే భరించాల్సి ఉందని చెప్పారు. పోలవరం, అమరావతికి ఇచ్చిన నిధులకు లెక్కలు పంపించామని చంద్రబాబు తెలిపారు. అమరావతికి రూ. 2,500 కోట్లు ఇచ్చారని, ఆ లెక్కలు పంపించామని వెల్లడించారు. మౌలిక వసతులకు రూ. 42,900 కోట్లు ఖర్చవుతుందని... ఇప్పటి వరకు కేవలం రూ. 1500 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. యూసీలు ఇవ్వడం లేదు కాబట్టే నిధులు ఇవ్వడం లేదు అని చెప్పడం దారుణమని మండిపడ్డారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆరు నెలల్లో విశాఖ రైల్వే జోన్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారని... ఎన్నో కమిటీలు వేశారని... కానీ ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే జోన్ ను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీని పెండింగ్ లో పెట్టారని అన్నారు. ఐఐటీ తిరుపతికి రూ. 100 కోట్లు మాత్రమే ఇచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. 11 జాతీయ విద్యాసంస్థలకు రూ. 11 వేల కోట్ల విలువైన భూములను ఇచ్చామని... వీటి ఏర్పాటుకు రూ. 11,500 కోట్లు ఖర్చవుతుండగా... కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 400 కోట్లు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. దుగరాజపట్నం పోర్టు కుదరదంటున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సీట్లను పెంచుతామన్న హామీ కూడా నెరవేరలేదని చెప్పారు. అది అడిగితే, రాజకీయం అంటారని, ఆ విషయం అడగటం కూడా మానేసాను అని చెప్పారు..