కేంద్రానికి చంద్రబాబు భయపడుతున్నారు... మోడీకి భయపడుతున్నాడు అంటూ కొంత మంది చేస్తున్న వ్యాఖ్యల పై చంద్రబాబు అసెంబ్లీలో స్పందించారు... బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఆయన మాట్లాడుతూ, ఏపీ హక్కుల సాధనలోఎక్కడా రాజీపడలేదని, లాలూచీ రాజకీయాలు ఎప్పుడూ చేయలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. తనపై ఎలాంటి కేసులు లేవని, నిప్పులా బతికానని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, దేశంలో సీనియర్ నేతల్లో తొలిస్థానంలో ఉన్నానని ఆయన తెలిపారు. సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. రాజశేఖర్ రెడ్డి 28 సార్లు ఎంక్వయిరీ వేసాడని, సోనియా కూడా ఎన్నో సార్లు తన పై కేసులు పెట్టటానికి చూసింది అని చెప్పారు
మంత్రి పదవులు పట్టుకుని వేలాడుతున్నారని అంటున్న వారికి సమాధానంగా, దేశ రాజకీయాల్లో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ లాంటి వాటిని లీడ్ చేసి, కేంద్రంలో ప్రభుత్వాలని ఏర్పాటు చేసానని గుర్తు చేసారు... వాజ్ పాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో, మన మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి, 6 మంత్రి పదవులు ఇస్తానన్నా తీసుకోలేదని గుర్తు చేసారు... అలాగే పోలవరం పై కూడా రాష్ట్రము ఎందుకు తీసుకొందో చెప్పారు, ప్రత్యేకహోదా ఇవ్వరు, నిధులు ఇవ్వరంటే చాలామంది ఆందోళన చెందారు. భయభ్రాంతులకు గురయ్యారు. ఆ సమయంలో ప్రధానికి ఫోన్‌చేసి ఇక్కడి పరిస్థితిని వివరిస్తే.. ఆయన రమ్మన్నారు. దిల్లీకి వెళ్లాం. నీతిఆయోగ్‌ను పిలిచి చెబితే అన్నీ వివరించాం. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తే అనుకున్న సమయానికి పూర్తవుతుందని భావించి రాష్ట్రానికి ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. అప్పుడు పోలవరం తీసుకున్నాం అని చెప్పారు..
లెక్కలు చెప్పటం లేదు అనేదాని పై స్పందిస్తూ, ఏ రోజు, ఏ లెక్కలు కేంద్రానికి పంపించింది, ఎన్ని యూసీలు పంపారో వివరాలు చెప్పారు... ఉమ్మడి ఏపీలో కేంద్రాన్ని ఎప్పుడూ నిధులు అడగలేదని, ఇప్పుడు కష్టాల్లో ఉన్నాం కాబట్టే సహకరించాలని కోరుతున్నామన్నారు. సంపద సృష్టించే రాష్ట్రాలను ఆదుకోవాలని, కేంద్రం నిధులు ఇవ్వలేదని అభివృద్ధి ఆగదన్నారు. కేంద్రం సాయం చేయలేదని... చెప్పడానికి సిద్ధంగా లేనని చంద్రబాబు చెప్పారు. జాతీయ సగటు కన్నా ఎక్కువ వృద్ధిరేటు సాధిస్తున్నామన్నారు. రాయలసీమలో ఎప్పుడూ జరగనంత అభివృద్ధిని చేసి చూపామని, కొంతమంది ప్రాంతీయ విద్వేషాలను రగిలించాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.