విజయవాడలోని మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాలలో సోమవారం అమరావతి డిక్లరేషన్ సదస్సును ఘనంగా నిర్వహించారు. నేటి వరకట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే రోజుల నుండి, నాటి కన్యాశుల్కం తీసుకుని పెళ్లి చేసుకునే రోజులు మహిళాలోకానికి దగ్గరలోనే ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. మహిళా సాధికారత కోసం నిర్వహించిన అమరావతి మహిళా పార్లమెంట్లో తీసుకున్న డిక్లరేషన్‌పై ఏపీ చట్టసభల్లో చర్చించి, వాటిని సమర్థవంతంగా అమలు చేసి చూపించి అందరికి ఆదర్శంగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేసిన ఆయన తద్వారా మహిళా సాధికారతకు ఏపీ కేంద్ర బిందువుగా నిలువ నుందన్నారు.
ఈ సందర్భంగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి కూడా ముఖ్య అతిధిగా హాజరయ్యి, మాట్లాడారు.. ఆంధ్రప్రదేశ్ ఇండియాకే కాదు...ప్రపంచానికే మోడల్ స్టేట్ అని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి కొనియాడారు. సన్‌రైజ్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ను రూపొందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని ఆయన కొనియడారు. భవిష్యత్తులో ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.
అమరావతి డిక్లరేషన్ ద్వారా మహిళా సాధికారితకు అడుగులు వేసి ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా నిలిచిందన్నారు. అమరావతి డిక్లరేషన్ రూపొందించిన 10 అంశాలు, అదిపరాశక్తి దుర్గామాతకు 10 అవరతాలుగా అభివర్ణించారు. మహిళలు, బాలికలకు రక్షణ కల్పిస్తే వారిని గౌరవించినట్టేనని, మహిళలు ఎక్కడ పూజింపబడతారో... అక్కడే దేవుళ్లు కొలువుదీరుతారని సత్యార్థి వ్యాఖ్యానించారు. ‘‘నేను ఏపీకి వచ్చిన ప్రతిసారి ఇక్కడి యువత నన్ను ఆకట్టుకుంది’’ అని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి చెప్పారు.