పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన దిగువ కాఫర్ డ్యాం నిర్మాణం పనులను ఈ వారంలోనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. స్పిల్‌వే, స్పిల్ చానల్లో కొంత భాగం కాంక్రీట్ పనులు, తవ్వకం పనులకు సంబంధించి కొత్త టెండర్లను పిలవడంతో పాటు డిసెంబర్ 15 కల్లా నిర్మాణ సంస్థలను ఖరారు చేయాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రధాన నిర్మాణ సంస్థ అయిన ట్రాన్స్ట్రాయ్కు తాము వ్యతిరేకం కాదని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తికావాలన్నదే అసలు ఉద్దేశమని ముఖ్యమంత్రి అన్నారు.
ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి గడ్కరీకి వివరించామని చెప్పారు. పోలవరం నుంచి గోదావరి నీటిని తమిళనాడుకు సైతం తీసుకువెళ్లాలని యోచిస్తున్న కేంద్రం దీనిపై అధ్యయనం జరపాల్సిందిగా మన రాష్ట్రాన్ని కోరిందని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో గడిచిన వారం రోజుల్లో 26 వేల క్యూబిక్ మీటర్ల తవ్వకం పూర్తయ్యిందని, 10,891 క్యూబిక్ మీటర్ల మేర స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు చేపట్టామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటివరకు 4 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తికాగా, మరో 14.52 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేపట్టాల్సి వుందని తెలిపారు. 384 ఆర్మ్ గిర్డర్ల ఫ్యాబ్రికేషన్ పూర్తి చేశామని, 20 హారిజంటల్ గిర్డర్లు సిద్ధమయ్యాయని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మొత్తం 28 ప్రాధాన్య ప్రాజెక్టులలో మరో తొమ్మిది పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. ఎర్రకాలువ ఆధునీకరణ, పోగొండ రిజర్వాయరు, పెదపాలెం ఎత్తిపోతల పథకం, చినసాన ఎత్తిపోతల పథకం, మారాల రిజర్వాయరు, చెర్లోపల్లి రిజర్వాయరు, అవుకు టన్నెల్, గోరకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, సిద్ధాపురం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో ఇంకా సుమారు 7 వేల చెక్‌డ్యాంలు నిర్మించాల్సిన అవసరం వుందని లెక్క తేల్చిన అధికారులు ఇప్పటివరకు 3,020 చెక్‌డ్యాంలు నిర్మించగా, మరో 3,271 చెక్‌డ్యాంలు నిర్మాణంలో వున్నట్టు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.