దివి సీమ... కృష్ణా డెల్టాలోనే చిట్టచివారి ఆయకట్టు ప్రాంతం అయినా, ఈ పేరు వినగానే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది ఈ ప్రాంతంలో రైతులు ఎదుర్కొనే సాగునీటి కషాలే.... దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ పరిస్థితి కారణంగా రైతులు ఏటా నష్టాలను చవిచూస్తున్నారు. పంట కాల్వల పైనే ఆధారపడి వ్యవసాయం చేసే ఈ ప్రాంతంలోని అన్నదాతలకు గత సంవత్సరం నుంచి ప్రభుత్వం పట్టిసీమ ద్వారా అందిస్తున్న సాగునీరు వారి పాలిట వరంగా మారింది. దాదాపు లక్ష ఎకరాల ఆయకట్టు కలిగిన దివి ప్రాంతంలో రెండేళ్లుగా ఏర్పడిన తీవ్ర వర్షా భావ పరిస్థితుల్లోనూ రైతులు సిరులు పండించారంటే అందుకు ప్రధాన కారణం పట్టిసీమే. ఈ సంవత్సరం జూన్ నెలలోనే సాగునీరు విడుదల కావటంతో కాల్వ చివరి ప్రాంతాలైన నాగాయలంక, కోడూరు, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో డిసెంబరు మొదటి వారానికే పంట చేతికొచ్చింది. అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రికార్డు స్థాయిలో దిగుబడులు నమోదవుతున్నాయి.
ఏటా తీవ్ర సాగునీటి ఎద్దడి కారణంగా నాగాయలంక మండలం గుల్లలమొద, సోర్లగొంది, గణపేశ్వరం, నాలి, కమ్మనమోల గ్రామాలు, కోడూరు మండలం రామకృష్ణాపురం, ఇరాలి, బసవ వానిపాలెం, ఊటగుండం, మోపిదేవి మండలం పెదకళేపల్లి, చింతలమడ, చల్లపల్లి మండలం మాజేరు, ఘంటసాల మండలం చిలకలపూడి, రుద్రవరం ప్రాంతాల్లో రైతులు నష్టాల పాలయ్యే సందర్భాలే ఎక్కువ. పట్టిసీమ పుణ్యమా అని జూన్ నెలలోనే సాగునీరు విడుదల కావటంతో జులె నెలాఖరు నాటికే దాదాపు ఎగువ రైతులంతా నాట్లు పూర్తీ చేసుకోవటంతో చివరి రైతులకు వంతులవారీగా నీటిని విడుదల చేసారు... సాగునీటి ఎద్దడి తలెత్తినా రైతులు మొక్కవోని ధైర్యంతో సాగు కొనసాగించటంతో కాల్వ చివరి గ్రామాల్లో ప్రస్తుతం వరి పైరు పొట్ట, ఈనిక దశల్లో ఉంది. ఎగువ పొలాల్లో వరి పైరు దాదాపగా గింజ గట్టిపడే దశకు చేరుకుని కోతకు సిద్ధమైంది.
దివిసీమ అంతా మొత్తం వరి పచ్చగా దర్శనమిస్తూ రైతుకు కనువిందు చేస్తోంది. పట్టిసీమ ద్వారా సకాలంలో నీరు అందడంతో పాటు కొండకోనల నుంచి పోషకాలతో కూడిన ఒండ్రును మోసుకురావటంతో పంటపొలాల్లో వరి పైరు బంగారు వర్ణంతో కనుల పండుగ చేస్తుంది. ఇప్పటికే కోతకు వచ్చిన ఏ పోలాలని పరిశీలించినా, బంగారు వర్ణంలో మిల మిల లాడుతూ దర్శనమిచ్చే వారి పైరును చుస్తే ఎకరాకు 35 నుంచి 45 బస్తాల మేర దిగుబడి వచ్చే అవకాసం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు...