పోలవరం పై కేంద్రం ఇబ్బందులు తెడుతున్న వేళ, రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తితో ఉండటంతో, కేంద్రం స్పందించింది... లండన్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ఢిల్లీ చేరుకున్నారు.. ఢిల్లీకి చేరుకున్న వెంటనే, పోలవరం టెండర్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్న వైనం పై దృష్టి సారించారు. దీంతో, సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ దినేశ్‌కుమార్, జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా, కార్యదర్శి శశిభూషణ్ కుమార్‌కు, కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఫోన్ చేశారు. పోలవరంలో ఉన్న ఇబ్బందుల పై, మంగళవారం సాయంత్రం 6 గంటలకు కేంద్ర జల వనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వద్ద సమావేశం ఉందని వివరించారు.
కేంద్రం నుంచి కబురు రావటంతో, సోమవారం సాయంత్రమే మంత్రి ఉమా, కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే, చానల్ పనులకు సంబంధించిన టెండర్లను నిలిపేయాలంటే కేంద్ర జల వనులు శాఖ ఆదేశించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పోలవరం విషయంలో రాష్ట్రంలో అలజడి వాతావరణం ఉండటంతో, పరిణామాలన్నింటినీ పరిశీలిస్తున్న కేంద్రం వీలైనంత త్వరగా ఈ అంశానికి ముగింపు పలకాలని నిర్ణయించింది.
అక్టోబరు నెలలో కేంద్ర మంత్రి గడ్కరీతో, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి ఉమా జరిపిన సమావేశాల్లో పోలవరం పనుల్లో జరుగుతున్న జాప్యం, ట్రాన్‌స్ట్రాయ్‌కు 60(సి) కింద జారీ చేసిన నోటీసు, కొత్త సంస్థకు బాధ్యతలు అప్పగించేలా టెండర్లను పిలిచేందుకు సిద్ధం కావడం వంటి అంశాలన్నీ చర్చకు వచ్చాయి. ఈ సమావేశాల్లో ట్రాన్‌స్ట్రాయ్ గతంలో కోట్ చేసిన -14% కే కేంద్రం పరిమితమవుతుందని, అంతకుమించి పెరిగే భారాన్ని రాష్ట్రమే భరించాలని గడ్కరీ స్పష్టం చేశారు. ఇందుకు రాష్ట్రమూ సమ్మతించింది. ఈమేరకే కాంక్రీట్ పనులకు టెండర్లను పిలిచింది. మళ్ళీ దానికే కేంద్రం అభ్యంతరం చెప్పింది... వీటిన్నింటినీ సమావేశంలో చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.