పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీరు అందించేందుకు ప్రజలకు ఇచ్చిన మాట తప్పం.. ఎవరో కారుకూతలు కూస్తున్నారని వెనకడుగు వేయం... నిర్మాణం పూర్తి చేసి చూపిస్తాం అంటూ జల వనరుల మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఇప్పటిదాకా నిర్మాణ పురోగతి మీ కళ్ళకు కనపడలేదా, పట్టిసీమ ద్వారా నీళ్ళ మళ్ళించి పదివేల కోట్ల విలువైన పంట రైతులకు దక్కేలా చేయడం గమనించలేదా, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జనం ఊరుకుంటారా, మీ సంగతి అంతా చూస్తున్నారు. అంటూ ఉమ విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పనుల పనితీరును సోమవారం ఆయన స్వయంగా పరిశీలించారు. పురోగతి ఏ దశలో ఉందో అడిగి తెలుసుకున్నారు. ప్రతిపక్షాలపై నిప్పలు చెరిగారు, ప్రాజెక్టు పూర్తి చేసి నీరు అందిస్తామంటూ సవాల్ విసిరారు. కేంద్రంతో చర్చించి పనులు పూర్తయ్యేలా చూస్తామంటూ భరోసా ఇచ్చారు.
ఈ మధ్యనే పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపివేయాల్సిందిగా కేంద్రం నుంచి వర్తమానం అందిన తరువాత తొలిసారిగా ఆయన సోమవారం ప్రాజెక్టు స్థలికి వచ్చారు. స్పిల్వే, ఎర్త్ కం రాక్పిల్ డ్యాం, కాపర్ డ్యాం పనులను పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల 21న టెండర్లు గడువు పూర్తవతుందని, 22వ తేదీన టెండర్లు తెరుస్తారని చెప్పారు. సిల్వే పనులు ఇప్పటికే వేగంగా కొనసాగాయి. మరే ప్రాజెక్ట్ లోనూ ఈ తరహా వేగం లేదు. ప్రతీ సోమవారం ముఖ్య మంత్రి వర్చువల్ ఇన్స్పెక్షన్, వీలైతే ప్రాజెక్టు సందర్శన చేయడంతోనే ఇది సాధ్యమైందని మంత్రి అన్నారు. కాని కొందరు బాజాభజంత్రీలు కావాలని అక్కస్సుతో టెండర్ల ప్రక్రియను అబాసుపాలు చేసే విధంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
పనులు పూర్తి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు, ఇదేదీ వారికి పట్టదు. టివిల ముందు కూర్చుని లేని పోని మాటలు మాట్లాడుతున్నారు. అధికారంలో ఉండగా వీరంతా ఎక్కడికిపోయారని, వ్యాఖ్యలు చేశారు. పోలవరం పూర్తి కావడం వీరెవరికీ ఇష్టంలేదు. వైఎస్ ఆత్మగా పేరొందిన వ్యక్తులతో కేంద్రానికి ఫిర్యాదులు చేయిస్తారు. ఇంకొందరు పరిస్థితిని తప్పుదారి పట్టిస్తారు. ఇంకా తగదునమ్మా అంటూ వైసీపీకి చెందిన ఎమ్మెల్వేలు పోలవరంకు బస్సులేసుకుని వస్తారటా అంటూ దేవినేని ఉమ విరుచుకుపడ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ పవర్ ప్రాజెక్టు టెండరు కొట్టి వేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. దీనిపై ఇప్పటికీ కోర్టులో కేసులు నడుస్తున్నాయన్నారు. విదేశాల నుంచి వారి కుటుంబాలను వదిలేసి, ఇక్కడకు వచ్చిన ఇంజినీర్లు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పనులు చేయిస్తుంటే, టీవీల ముందు కూర్చునే వైఎస్ ఆత్మలు, వైఎస్ భజనపరులు ఏమీ జరగడం లేదంటూ మాట్లాడటాన్ని ఎద్దేవా చేశారు. నీ బ్రతుక్కి ఒక్కసారి అయినా పోలవరం వచ్చావా అంటూ జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు... నువ్వు, నీ న్నాన్న ఇన్నేళ్ళు ఉన్నారు, పులివెందులకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారని ఉమా అన్నారు...