విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాలలో వెనుకబడి ఉన్న వాల్మీకి, బోయ సామాజిక వర్గ ప్రజలను ఎస్టీ జాబితాలో కల్పించాలన్న డిమాండ్ కూడా, చంద్రబాబు తీర్చారు... సచివాలయంలో ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపి కేబినెట్ సమావేశంలో, వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేరుస్తూ మంత్రి వర్గం తీర్మానం చేసింది. ఈమేరకు కేంద్రానికి కేబినెట్ తీర్మానం పంపనుంది.
1956వ సంవత్సరంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వచ్చిన అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నీలం సంజీవ రెడ్డి తన సామాజిక వర్గ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటి వరకూ ఎస్.సి. జాబితాలో ఉన్న మైదాన ప్రాంత వాల్మీకి బోయలను బీసీ జాబితాలో చేరుస్తూ 63/ 1956 యాక్టు తీసుకు వచ్చారు. దాంతో ఒకే రాష్ట్రంలో ఉన్న వాల్మీకి బోయలను ప్రాంతాల వారీగా బీసీలుగా, ఎస్టీలుగా విభజించి దారుణ అన్యాయం చేశారు. అప్పటి నుంచీ వాల్మీకి బోయ కుల సంఘాలవారందరూ ఈ అన్యాయాన్ని సరిచేయాలని, ఈ కులం మొత్తాన్ని ఎస్.టిలుగా మార్చాలనీ ఉద్యమాలు చేస్తున్నారు.
ఈ పరిణామాలతో చంద్రబాబు పాదయాత్ర చేసేప్పుడు, తాను అధికారంలోకి వస్తే, వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేరుస్తా అని హామీ ఇచ్చారు... ఇప్పుడు ఆ హామీ నెరవేర్చారు... "నా రాజకీయ జీవితంలో కల నెరవేరింది"అని మంత్రి కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. ఇవాళ కేబినెట్ భేటీ అనంతరం మంత్రి మాట్లాడారు.. క్యాబినెట్ నిర్ణయంతో మంత్రి కాల్వ ఆనందం వ్యక్తం చేశారు. బోయల రిజర్వేషన్ల కోసం కాల్వ మొదటి నుంచి కృషి చేస్తున్నారని సహచర మంత్రులు అభినందించారు.