నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని, విజయవాడ శివారు నున్నలో ఎలక్ట్రికల్ బైకుల తయారీ ఫ్యాక్టరీ రానుంది... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ ‘చందన’ కుటుంబానికి చెందిన ఏవీఈ రమణ, చాందినీ చందన దంపతులు ‘చందన కార్ప్’ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి ‘అవేరా’ పేరుతో బ్యాటరీ బైకులు, స్కూటర్లను తయారు చేయనున్నారు... రూ.200 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ పరిశ్రమపై తొలి దశలో రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు... విజయవాడ శివారు నున్నలో, సుమారు 63 ఎకరాల విస్తీర్ణంలో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. .
వచ్చే వారం రాష్ట్ర ప్రభుత్వంతో ఈ సంస్థ ఎంవోయూ చేసుకోనుంది. ఈ-బైకుల్లో ఉపయోగించే లిథియం ఐరన్ ఫాస్ఫేట్(ఎల్‌ఎఫ్‌పీ) బ్యాటరీలను, బోష్ కంపెనీ మోటార్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. 60 శాతం పరికరాలను స్థానికంగా తయారు చేస్తారు. అందులో భాగంగా ఈ-బైకులో కీలకమైన చిప్‌లను దక్షిణ కొరియా సాంకేతిక సహకారంతో అనంతపురం, చిత్తూరుల్లోని ఎలకా్ట్రనిక్ క్లస్టర్స్‌లో తయారు చేయాలని నిర్ణయించారు. నున్నలో కేవలం అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తారు.
వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నాటికి పరిశ్రమను ఏర్పాటు చేసి ఉత్పత్తిని ప్రారంభించాలని చందన కార్ప్ భావిస్తోంది. ‘అవేరా’ ద్విచక్రవాహనాల్లో అత్యాధునిక లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీని వినియోగించడంతోపాటు ఎలక్ట్రిక్ మోటార్ టెక్నాలజీ ద్వారా గంట చార్జింగ్‌కు 250 కిలోమీటర్ల మైలేజీని సాధించగలుగుతున్నామని సంస్థ ఎండీ రమణ తెలిపారు. ఈ-బైకుల ధర అధికంగా ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలతో సాధారణ బైకుల ధరకే వీటిని అందించేందుకు చందన కార్ప్ సిద్ధమవుతోంది. ఈ సంస్థ తయారు చేసే స్కూటర్ ధర రూ.2.50 లక్షలు అయితే రాయితీలు పోను రూ.70 వేలకు, స్పోర్ట్స్ బైక్ ధర రూ.5 లక్షలు కాగా, రూ.లక్షకే విక్రయించనున్నారు.