సమాచార, సాంకేతిక రంగంలో విప్లవాత్మక ముందుడుగుగా భావించే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ఫలాలు ప్రజలందరికీ విస్తరించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం నెరవేరనుంది. ప్రధాని మోదీ కలగన్న డిజిటల్ ఇండియాకు ఏపీ నుంచే అంకురార్పణ జరగనుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ఏపీలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. రాష్ట్రాన్ని 'డిజిటల్ ఏపీ'గా తీర్చిదిద్దే 'ఫైబర్ గ్రిడ్' ప్రాజెక్టులో భాగంగా ప్రజలకు ఒక్క కనెక్షన్‌తో మూడు సేవలు లభిస్తాయి.
15 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్, టెలిఫోన్, 250 చానెళ్ల ప్రసారానికి రూ.149 మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రసారాల కోసం ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ (ఐపీటీవీ), జిగాబైట్ యాక్టివ్ పాసివ్ ఆప్టిక్ నెట్‌వర్క్ (జీపాన్) బాక్సులను అందజేస్తారు. ఇతర ప్రైవేటు ఆపరేటర్లు అందించే సెట్‌టాప్ బాక్సుల కంటే.. ఏపీ ఫైబర్ నెట్ అందించే ఐపీటీవీ, జీపాన్ బాక్సులు అత్యంత సమర్థవంతమైనవి. అందువల్ల ఈ బాక్సుల ధర రూ.4000 దాకా ఉంటుంది. ఇంత భారాన్ని సామాన్యులపై ఒకేసారి వేయడం సరికాదని భావించిన ఏపీఎ్‌సఎ్‌ఫఎల్.. నెలకు రూ.100 చొప్పున 40 నెలల్లో వసూలు చేయాలని నిర్ణయించింది.
ఫైబర్‌గ్రిడ్ పథకంలో భాగంగా ట్రిపుల్ ప్లే సర్వీసు, విలువ ఆధారిత సేవలు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. ట్రిపుల్ ప్లే సర్వీసుల కింద వాయి్‌స(టెలిఫోన్), వీడియో(టీవీ చానల్స్), డేటా(ఇంటర్నెట్) సేవలు అందిస్తారు. దీనిలో ఐపీ టెలివిజన్ (250 చానల్స్- హెచ్‌డీ చానళ్లతో సహా), అన్ లిమిటెడ్ హైస్పీడ్ వైఫై (గృహాలకు 15 ఎంబీపీఎస్, గృహేతరాలకు 100 ఎంబీపీఎస్), ఉచిత టెలిఫోన్ కనెక్షన్ (ఏపీ ఫైబర్ ఖాతాదారుల మధ్య ఉచిత అన్ లిమిటెడ్ కాల్స్) ఉంటాయి. ఇక విలువ ఆధారిత సేవల విభాగంలో కోరుకున్న సినిమాలు, వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం, ఇ-కామర్స్, చదువు, వైద్యం, వ్యవసాయ సంబంధిత సమాచారం, టెలిమెడిసిన్, ప్రోగ్రామ్ రికార్డింగ్, ఆన్‌లైన్ బిల్ పేమెంట్స్, క్యాచప్ టీవీ, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్, క్లౌడ్ ఆధారిత సేవల వంటివి అందిస్తారు. సేవలను పొందాలంటే మరిన్ని వివరాల కోసం 1800-599-5555 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలి.