సంక్రాంతి కంటే ముందే వస్తున్న నవక్రాంతి ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమం అని, పదకొండు రోజులు కొనసాగే పెద్ద పండుగ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లోని తెలుగువారందరికీ ఆయన 2018 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండుగ మూడు రోజుల సంబరమైతే ఇది 11 రోజుల పండుగ అని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా స్వగ్రామాలకు తరలివచ్చి రెండో తేదీ నుంచి ఆరంభం కానున్న ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నూతన సంవత్సరానికి నూతన సంకల్పం తీసుకోవాలని కోరారు.
పుట్టిన నేల రుణం తీర్చుకోవాలని, పల్లెల్లో నవక్రాంతులు నింపాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పదహారు వేల కోట్ల ద్రవ్య లోటుతో నవ్యాంధ్ర ప్రయాణం నలభై రెండు నెలల క్రితం ప్రారంభమైందని, దశాబ్దాలుగా నినాదంగా మోగిన నదుల అనుసంధానాన్ని పట్టిసీమ ద్వారా నిజం చేశామని చంద్రబాబు చెప్పారు. కృష్ణానది ఎగువ ప్రాజెక్టుల నుంచి చుక్కనీరు రాని తరుణంలో పట్టిసీమ ద్వారా గోదావరి నదీ జలాలను ప్రకాశం బ్యారేజీకి తీసుకొచ్చామన్నారు. మూడేళ్లుగా కృష్ణా డెల్టాలో పట్టిసీమ గోదావరి జలాలతో 18 వేల కోట్ల విలువైన పంట రైతుల ఇంటికి చేరిందని, గోదావరి సారవంతమైన ఎర్రని నీటితో కృష్ణా డెల్టా రైతులు అధిక దిగుబడులు సాధించారని అన్నారు. నదుల అనుసంధానం చేసి రైతాంగం కళ్లల్లో ఆనందం చూసి, ఇటీవల ప్రకాశం బ్యారేజీ 60 ఏళ్ల ఉత్సవాల్లో పాల్గొన్నందుకు తానెంతో గర్వించానని చెప్పారు.
విభజన నాడు 22.5 మి.యూ విద్యుత్తు లోటుఉందని, నిరంతర విద్యుత్తు పథకంతో 3 నెలల్లోనే సాధారణ పరిస్థితికి తెచ్చామని, ఏడాదికే మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత తమ ప్రభుత్వానిదని చంద్రబాబు తెలిపారు. సమన్యాయం లేకుండా, అశాస్త్రీయంగా జరిగిన విభజనతో ఆరుదశాబ్దాల కష్టం వృధా అయ్యిందని, అయినా కోలుకొని రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఏడాదిన్నర లోగానే వెలగపూడిలో సచివాలయం నిర్మించి, ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకొచ్చి సొంతగడ్డ నుంచి పాలన ప్రారంభించామని గుర్తు చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి 33 వేల ఎకరాలను భూసమీకరణ చేశామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ వన్ ర్యాంక్ సాధించిందని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ప్రారంభించామని చంద్రబాబు చెప్పారు. ఆర్ధికంగా ఒడిదుడుకుల్లో ఉన్నా పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణ ఉపశమనం అమలు చేశామని, 45 లక్షల సామాజిక పింఛన్లు అందజేస్తున్నామని శరవేగంగా పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి నిరంతర శ్రమతో, పటిష్ట వ్యూహంతో ముందుకు సాగుతున్న తమ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.