ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ జన్మభూమి కార్యక్రమంలో భాగంగా, శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు... ఈ సందర్భంగా ఇచ్చాపురంలో చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు.. గవర్నమెంట్ కాలేజీ గ్రౌండ్‌లో జన్మభూమి సభను ఏర్పాటు చేశారు... సభలో చంద్రబాబు ప్రసంగించారు. జన్మభూమి-మా ఊరు స్ఫూర్తిదాయక కార్యక్రమం అని చెప్పారు. జన్మభూమి రుణం తీర్చుకోవటానికే ఈ కార్యక్రమం తలపట్టామని తెలిపారు... 16వేల గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమం జరుగుతోందన్నారు. 35 కుటుంబాలకు ఒక డ్వాక్రా మహిళను ఇన్‌చార్జ్‌గా పెట్టామని చెప్పారు...
మరుగుదొడ్లపై ప్రజల్లో అవగాహన పెరిగిందని సీఎం చెప్పారు. గతంలో బహిరంగ మల విసర్జనతో అవమానాలు ఎదుర్కొన్నారని, నా ఆడబిడ్డలను కష్టాల నుంచి విముక్తి కల్పించేందుకు వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టిస్తున్నామన్నారు. పట్టణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్మించుకుంటే రూ.15వేలు ఇస్తున్నామని, సెల్‌ఫోన్లపై ఉన్న ప్రేమ మరుగుదొడ్ల నిర్మాణంపై లేదన్నారు. చంద్రన్న బాట కింద పెద్ద ఎత్తున రోడ్లను నిర్మిస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు.
మార్చి 31తేదీ లోపు అందరూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. మరుగుదొడ్లు కట్టకపోతే మీ ఇంటికొచ్చి కూర్చుంటా, మౌన దీక్ష చేస్తానన్నారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా మహిళలకు విజ్ఞానం పెరుగుతుందని, గర్భిణిలను గౌరవంగా ఇంటికి పంపించేందుకు తల్లి, బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించామన్నారు. ఇంటి పెద్ద చనిపోతే కుటుంబం అనాధ కాకూడదనే చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. గ్రామ పంచాయతీల్లో కూరగాయలు పండించే క్షేత్రాలు ఏర్పాటు చేశాం..ఆ కూరగాయలను గ్రామాల్లోని పిల్లలకు ఆహారంగా వినియోగిస్తామని ఆయన చెప్పారు.