ఆంగ్లేయుల పాలనలో ప్రారంభమైన జనవరి 1 నూతన సంవత్సర వేడుకలను అన్ని ఆలయాల్లో నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది... సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఆలయాల్లోకి పాశ్చాత్య సంస్కృతి విస్తరించకుండా దేవాదాయశాఖ చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోని పలు ఆలయాల్లో జనవరి 1న ప్రత్యేకంగా తోరణాలు కట్టడంతో పాటు ముగ్గులు వేసి పండుగ వాతావరణం సృష్టిస్తున్నారు. ఇకపై అలాంటి వేడుకలు, కార్యక్రమాలు ఆలయాల్లో జరగడానికి వీల్లేదని స్పష్టంచేస్తూ ఆ శాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
చైత్రమాసంలో వచ్చే ఉగాదినే కొత్త సంవత్సరాదిగా భావించాలని, ఆ రోజే వేడుకలు, కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేసింది. పాశ్చాత్య సంప్రదాయాలకు పట్టంకడుతూ గుడికి వచ్చిన భక్తులకు శుభాకాంక్షలు తెలపడం, వారు సమర్పించిన కానుకలను పుష్పాలంకరణలకు ఖర్చు చేయడం సరికాదని తన ఆదేశాల్లో పేర్కొంది. అన్ని ఆలయాల ఈవోలు, జిల్లాల సహాయ కమిషనర్లకు ఈ ఆదేశాలను పంపింది. భక్తులు రొజూ లాగానే, వచ్చి దేవుడు దర్శనం చేసుకోవచ్చు అని, ఆలయాల్లో మాత్రం, ఆంగ్ల నూతన సంవత్సరం కోసం ఎలాంటి ఏర్పాట్లు చెయ్యవద్దు అని పెర్కున్నారు...
అయితే ఈ సూచనలను అన్ని ఆలయాల్లో తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్న దేవాదాయశాఖ అందులో ‘తప్పనిసరి’ అనే పదాన్ని కొట్టివేసింది. కాగా, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 వసంతాలు గడిచినా ఆంగ్లేయులు అలవాటు చేసిన క్రీస్తు శకాన్ని మనం ఇప్పటికీ అనుసరిస్తూనే ఉన్నామని హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టు కార్యదర్శి డాక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఉగాది రోజు మాత్రమే కొత్త సంవత్సరం జరుపుకోవాలని పెర్కున్నారు...