విజయవాడ వాసుల మరో కల త్వరలోనే తీరబోతోంది... పని సైలెంట్ గా సాగిపోతుంది... విజయవాడ తూర్పు MLA గద్దె రామ్మోహన్ కృషితో, నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి, ఎన్నో వ్యయ ప్రయాసలు తట్టుకొని, కృష్ణ నది ఒడ్డున ఉన్న కృష్ణలంక ప్రాంత వాసుల ముంపు శాశ్వతమైన నివారణకు కరకట్టకు రిటైనింగ్ వాల్ పనులను జోరుగా సాగుతున్నాయి. దీనికి ముఖ్యమంత్రి సహకారం ఉండటంతో, కల ఫలిస్తుంది. విజయవాడ నగరంలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో లక్ష మంది ప్రజల చిరకాల స్వప్నం ఇది. నదికి వరదలు వస్తే, కృష్ణాతీరం ఒణికి పోతుంది.
నీట మునిగిన ఇళ్లను వదిలి, రోజుల తరబడి పునరావాస శిబిరాల్లో మగ్గుతూ అంతులేని వ్యధను అనుభవించే లోతట్టు ప్రాంత ప్రజలకు రక్షణ ఇది. వీరి కషాలకు చరమగీతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మహా యజ్ఞం ఈ రక్షణ గోడ. ఎన్నికల హామీగా మిగిలిపోయిన ఈ రక్షణ గోడను నిజం చేస్తూ చేపట్టిన నిర్మాణ పనులు మొదటి దశ ముగింపు దశకు వస్తున్నాయి. యనమలకుదురు నుంచి కనకదుర్గ వారధి వరకు ఈ గోడను నిర్మిస్తున్నారు. యనమలకుదురు నుంచి కనకదుర్గ వారధి వరకు ఐదు కిలోమీటర్ల మేర భారీ రక్షణ గోడను నిర్మించటానికి ఇరిగేషన్ శాఖ ప్రణాళికలు రూపొందించింది.
రక్షణ గోడను నిర్మించటానికి రూ. 545 కోట్ల వ్యయంతో అంచనాలను రూపొందించింది. తొలిదశలో దాదాపు సగ దూరం (2.1 కిలోమీటర్ల) రక్షణ గోడ నిర్మాణానికి రూ. 164 కోట్ల నిదులను ప్రభుత్వం విడుదల చేసింది. తొలిదశలో భాగంగా యనమలకుదురు నుంచి బాలాజీ నగర్ వరకు 2.1 కిలో మీటర్ల మేర రక్షణ గోడ నిర్మాణ పనులు చేపట్టారు. కనకదుర్గ వారధి నుంచి యనమలకుదురు వరకు పాతిక వేల కుటుంబాలు ఉన్నాయి. లక్ష మంది ప్రజలు నివసిస్తున్నారు. రక్షణ గోడ నిర్మాణంతో వరద భయం ఈ ప్రాంత ప్రజలకు ఉండదు.