హౌస్ బోట్ లకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న కేరళ పర్యాటకానికి దీటుగా ఇక కృష్ణా నదీ జలాలలో హౌస్ బోట్ ప్రయాణించనుంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్దిలో ఉపాధి కల్పనకు పెద్దపీట వేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేకించి దళితుల స్వయం ఉపాధికి సైతం ఉపకరించేలా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ కార్యాచరణ సిద్దం చేసింది. పర్యాటక రంగానికి ఆశాజనకమైన భవిష్యత్తు ఉండగా, తదనుగుణంగా సమాయత్తం కావాలని సీఎం పదేదపదే చెబుతున్న నేపధ్యంలో ఈ తాజా ప్రతిపాదన జీవం పోసుకుంది.
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ చెంతన నదీ జలాల్లో ఇంటి పడవలు పర్యాటకులకు మంచి అనుభూతిని ఇవ్వనుండగా, తొలి దశలో 15 పడవలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి పడవ ఏర్పాటుకు సుమారు రూ.కోటి వ్యయం కానుండగా, ఇందులో 15 శాతం ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్ధ సబ్సిడీగా అందించనుంది. ఎస్సి కార్పొరేషన్ కొంత మొత్తాన్ని సబ్సిడీ రూపంలో భరించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల నుండి రుణం సమకూర్చేలా పర్యాటక శాఖ కార్యాచరణ సిద్దం చేస్తోంది.
అయితే సాధారణ వ్యక్తులు సైతం ఈ ఇంటి పడవలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండగా, వీరికి కూడా 15 శాతం ఎపిటిడిసి సబ్సిడీ వర్తిస్తుంది. మిగిలిన 85 శాతాన్ని స్వయంగా గాని బ్యాంకు రుణం రూపంలో గాని లబ్ధిదారులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎపిటిడిసి పర్యవేక్షించనుండగా అందుకు అవసరమైన అన్లైన్ టికెటింగ్, మార్కెటింగ్‌కు పర్యాటక శాఖ బాధ్యత తీసుకుంటుంది