ఆంధ్ర యూనివర్సిటీ ‘టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్’ విడుదల చేసిన ర్యాంకులో, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రథమంగా నిలిచింది. గత ఏడాది మాదిరిగా 801 నుంచి 1,000 ర్యాంకుల శ్లాబ్లోనే ఉన్నప్పటికీ గతం కంటే కొంత మెరుగైన పరిస్థితిని పొంది రెండు రాష్ట్రాల్లో అగ్రగామి అయ్యింది. పరిశోధనలు, బోధన, విద్యార్థి ఆచార్యుల నిష్పత్తి, ప్రాంగణ ఉద్యోగాలు, మౌలిక వసతులు తదితరాలను ప్రాతిపదికగా తీసుకొని ర్యాంకుల జారీ జరిగింది. టిహెచ్ఇ సర్వే ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నింటా మెరుగైన స్థితిలోనే ఏయూ కొనసాగింది.
అవుట్ లుక్లోను మొదటి స్థానం..
అవుట్ లుక్ నిర్వహించిన సర్వేలోను రాష్ట్రంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం మొదటి ర్యాంకు పొందిందని ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రస్తుత టైమ్స్ హయ్యర్ ర్యాంకులలోను మొదటిగా నిలిచాం. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలోను దేశవ్యాప్తంగా 43వ ర్యాంకు పొందాం. ఎన్ఆర్ఐఎఫ్లోను మెరుగైన స్థితిలోనే ఉన్నాం. రానున్న రోజుల్లో ఫాకల్టీ నియామకాలు పూర్తయితే స్టూడెంట్ ఫాకల్టీ నిష్పత్తి మెరుగు కావడం వల్ల ర్యాంకుల్లో మరింత ముందుకు వెళ్తామని వీసీ ఆచార్య నాగేశ్వరరావు తెలిపారు.