మన కళ్ళ ముందు రోడ్డు ప్రమాదం జరిగితే ఏం చేస్తాం ? మహా అయితే 108కి ఫోన్ చేసి వెళ్లిపోతాం. కానీ, ఒక డీజీపీ స్థాయి అధికారి అలా చేయలేదు. రోడ్డు మీద గాయాలతో పడి ఉన్న అతన్ని తన కారులో కూర్చోబెట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. తక్షణం చికిత్స చేయించాడు. ఇదేదో…సినిమా స్టోరీలా ఉందా..? కానేకాదు.. జరిగిన వాస్తవం. మానవత్వంతో స్పందించిన ఐపీఎస్ ఎవరో కాదు ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావు.
ఈ రోజు మధ్యాహ్నం 12.00 గంటల సమయంలో డి.జి.పి. శ్రీ నండూరి సాంబశివరావు, ఐ.పి.యస్, అధికారిక విధులలో బాగంగా రాజమండ్రి ప్రయాణిస్తుండగా పెద్దవల్లి మండలం, ఖండవల్లి గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైన సంఘటన చూసి వెంటనే గాయపడిన వారిని తన వాహనంలో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వివరాలకు వెళ్తే, మండపేట గ్రామానికి చెందిన శ్రీ ఎలేటి వెంకట దుర్గాప్రసాద్ భార్య కుమారుడితో కలిసి చింతలపూడి నుండి మండపేటకు ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తుండగా ఎండ తీవ్రత వల్ల కళ్లు తిరిగి రోడ్డు ప్రక్కన వున్న చెట్టుకు డీకోనడం జరిగింది. ఈ సంఘటనలో వారి 7 సంవత్సరాల కుమారుడికి కుడి చేయి విరిగినది.
అదే సమయంలో అటుగా ప్రయాణిస్తున్న డి.జి.పి. గారు ప్రమాదాన్ని చూసి, తనే స్వయంగా వారిని పరామర్శించి గాయపడ్డ పిల్లవాడిని, తల్లిదండ్రులను తక్షణం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేశారు. ముగ్గురు క్షేమంగా వున్నారు.