నిర్మాణాత్మక ప్రతిపక్షం, సలహాలు సూచనలు ఇస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా స్పందిస్తారు అనే దానికి ఇది మరో ఉదాహరణ...
గడిచిన 35 రోజులుగా వ్యవసాయ వర్శిటీ విద్యార్థుల ఆందోళనపై ప్రభుత్వం స్పందించింది. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 64ను రద్దుచేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ప్రకటించారు.
మంత్రి మీడియాతో మాట్లాడుతూ 27.7.2017న జారీ చేసిన జీవో 64పై వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆందోళన నేపధ్యంలో ఈ జీవోను ఉపసంహరిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ, ఐసిఏఆర్ అధికారిక గుర్తింపు పొందిన రాష్ట్రేతర విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల విద్యార్ధులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పదోన్నతులు, నియామకాలతో పాటు విద్యా ప్రమాణాలను కాపాడుతామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి స్పష్టం చేశారు. సరైన విద్యా ప్రమాణాలను కలిగిన ఏ విద్యార్ధికి శాఖాపరమైన నియామకాల్లో అన్యాయం జరగదని హామీ ఇచ్చారు.
ఉత్తర్వులు రద్దు చేసిన నేపధ్యంలో వ్యవసాయ విద్యార్ధులు తక్షణమే తరగతులకు హాజరు కావాలని మంత్రి సోమిరెడ్డి కోరారు. విలువైన విద్యా సంవత్సరాన్ని నష్టపోవద్దని విద్యార్ధులకు హితవుపలికారు.
అయితే ఈ సమస్య పరిష్కారంలో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉంది. తమ భవిష్యత్‌కు అడ్డుగోడలా నిలిచిన జీఓ 64ను ఉపసంహరించేలా ప్రభుత్వాన్ని కోరాలంటూ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కోరారు. దీంతో ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఆ వెంటనే స్పందించిన చంద్రబాబు జీవో నెంబర్ 64ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
జీఓ నెంబర్ 64 ను ఉపసంహరించుకోవడంపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారుకు కృతజ్ఞతలు తెలియజేశారు. సుదీర్ఘ కాలంగా ఉన్న సమస్యను పరిష్కరించిన సీఎం చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.