ఉద్ధానం కిడ్నీ సమస్య శాశ్వత పరిష్కారానికి ఎన్ని నిధులైనా ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఇప్పటికే పలు కార్యక్రమాలను చేపట్టిందని ఆయన తెలిపారు. రూ.15 కోట్ల నిధులతో శ్రీకాకుళంలో ప్రపంచస్థాయి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పటికే రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలకు రక్షిత శుద్ధ నీటిని అందించేందుకు అవసరమైన ఆర్వో ప్లాంట్లను ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధక బృందంతో కలిసి తమ అధ్యయన నివేదికను సమర్పించి ప్రభుత్వానికి సిఫారసులు అందించేందుకు వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉద్ధానం కిడ్నీ సమస్య పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. హార్వర్డ్ నిపుణుల బృందం చేసిన సూచనలు, సిఫారసులను నిశితంగా విన్నారు. జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ చేసిన పలు సూచనలకు అప్పటికప్పుడే స్పందించి అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చారు.
శ్రీకాకుళంలో ఏర్పాటుచేయనున్న కిడ్నీ వ్యాధి పరిశోధనా సంస్థను భారతీయ వైద్య పరిశోధనా మండలితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టు, ఇందుకు అయ్యే మొత్తం వ్యయంలో 50% చొప్పున ఉభయులు భరిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఏడాదికి రూ.5 కోట్ల వంతున మూడేళ్లలో రూ.15 కోట్లను ఖర్చు చేయనున్నామని తెలిపారు. ఏటా రూ.5 కోట్ల ఖర్చు కాగల ఈ పరిశోధన కేంద్రానికి మూడేళ్లకు గాను ఒకేసారి నిధులు అందించామని చెప్పారు. దీనికి అవసరమైన రీతిలో సహకరించి మొత్తం ప్రాజెక్టులో భాగస్వామ్యం తీసుకునేందుకు ముందుకురావాలని హార్వర్డ్ మెడికల్ స్కూల్ బృందానికి సూచించారు. ‘ఉద్దానం కిడ్నీ సమస్య 30 ఏళ్లుగా ఆ ప్రాంతాన్ని పీడిస్తూ వుంది. వ్యాధికి సరైన కారణాలు ఇతమిత్ధంగా ఇంతవరకు కనుగొనలేకపోయారు. ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. వ్యాధిగ్రాస్థులకు ఉపశమనం కల్పించే అనేక చర్యలు మా ప్రభుత్వం తీసుకుంది. పవన్ కల్యాణ్ ఈ అంశంపై చొరవ తీసుకోవడం ముదావహం. హార్వార్డ్ వైద్య పరిశోధక బృందం ఇచ్చే విలువైన సూచనలు పరిగణనలోకి తీసుకుని ఉభయులం సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.
ఉద్దానంలో కిడ్నీవ్యాధితో మరణించిన వారి పిల్లలు ఎంతోమంది అనాధలవుతున్నారని, అటువంటి చిన్నారులను దత్తత తీసుకుని వారి బాగోగులు చూసేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని పవన్ కల్యాణ్ చేసిన సూచనకు అక్కడికక్కడే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. అనాధ బాలల సంరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రత్యేక సంస్థను ముందు ఉద్ధానం నుంచే మొదలుపెడతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ చిన్నారుల పూర్తి బాగోగులను చూసుకుంటుందని హామీఇచ్చారు.
ఉద్దానం బాధితులను ఆదుకోవాలని తాను చేసిన అప్పీల్‌కు వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేసిన పవన్ కల్యాణ్ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికేంతవరకు రాష్ర్ట ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని చెప్పారు. మిగిలిన సమస్యలతో పోల్చితే ఈ సమస్యను మానవీయకోణంలో ఆలోచించి తక్షణం పరిష్కారాన్ని కనుగొనాల్సి వున్నదని అన్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా వున్నాయని చెప్పారు.
ఉద్ధానం ప్రాంత ప్రజలు తమకు 50 శాతం వ్యాధి ముదిరిన తరువాత సమస్యను గుర్తిస్తున్నారని, అలాకాకుండా ముందస్తుగా వ్యాధిని పసిగట్టే విధానాలు, సాధనాలను ఏర్పర్చాల్సిన అవసరం ఉన్నదని పవన్ కల్యాణ్ చెప్పారు. దీనికి అనుగుణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మరింత బలోపేతం చేయాలని పవన్ కల్యాణ్ చేసిన సూచనపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి ఇప్పటికే రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిపుష్టానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అమలుచేస్తున్న నూతన ఆవిష్కరణల గురించి వివరించారు. ఉద్దానం పరిసర ప్రాంతాలలో వివిధ రకాల వైద్యపరమైన కోర్సులను పూర్తిచేసిన 900 మందిని ఉద్ధానం కిడ్నీ సమస్య పరిష్కార కార్యక్రమంలో భాగస్వామ్యుల్ని చేసేలా అవకాశాలు కల్పించాలని పవన్ కల్యాణ్ సూచించారు. వెంటనే ఆ వివరాలు సేకరించి వారందరినీ ఈ కార్యక్రమంలో ఏవిధంగా భాగస్వాముల్ని చేయాలో పరిశీలించి వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఉద్ధానం వ్యాధిగ్రస్తులు డయాలసిస్ కేంద్రాలకు వెళ్లి వచ్చేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలను ఉచితంగా కల్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం కిడ్నీ బాధితులకు నెలవారీ రూ.2,500 పెన్షన్ అందించడం మంచి పరిణామమని పవన్ కల్యాణ్ అభినందించారు. వారు అధిక శారీరక శ్రమతో కూడిన పనులు చేయలేని కారణంగా స్థానిక అవసరాలకు అనుగుణంగా వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి తగిన ఆదాయ మార్గాలు కల్పించాలని పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రికి సూచించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లాలోని 7 మండలాల్లోని 231 గ్రామాలలో కిడ్నీ వ్యాధి తీవ్రత ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య ఈ సమావేశంలో వివరించారు. ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, పలాస, మందస, వి.కొత్తూరు మండలాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్థులు ఉన్నారని తెలిపారు. కిడ్నీ వ్యాధిగ్రస్థులను గుర్తించి ముందస్తుగా వ్యాధి నివారణ చేపట్టడానికి 7 మండలాల్లో 15 ప్రత్యేక వైద్య బృందాల ఏర్పాటుచేసినట్టు తెలిపారు. ఒక వైద్యుడు, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, టెస్టింగ్ కిట్స్‌తో కూడిన ఈ బృందాలు 176 గ్రామాల్లోని 30 ఏళ్ల పైబడిన అందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయన్నారు. గత ఏప్పిల్ వరకు 1,01,593మందికి నిర్వహించిన వైద్య పరీక్షలలో 13,093 మందికి వ్యాధి ఉన్నట్టు నిర్ధరణ జరిగిందని తెలిపారు. వీరిలో 7,032మంది పురుషులు, 6,003మంది మహిళలు ఉన్నారని చెప్పారు. మొత్తం జనాభాలో 13 శాతం మందికి వ్యాధి ఉన్నట్టుగా నిర్దారించినట్టు తెలిపారు.
కిడ్నీ వ్యాధి చికిత్స నిమిత్తం ఉద్ధానం ప్రాంతంలో 3 ప్రత్యేక డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుచేశామని వివరించారు. మరో 14 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని అన్ని కమ్యూనిటీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లలో కిడ్నీ వ్యాధి నిపుణుల నియామకం చేస్తున్నామని పూనం మాలకొండయ్య తెలిపారు. దీని ద్వారా బాధితులు విశాఖ కేజీహెచ్‌కు వెళ్లవలసిన అవసరం లేకుండా ఎక్కడికక్కడే వైద్య నిర్ధరణ, చికిత్సలు జరుగుతాయని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కిడ్నీవ్యాధిపై సమగ్ర పరిశోధన నిర్వహిస్తున్నాయని, వి.కొత్తూరు మండలంలోని గునుపల్లి గ్రామంలో ఎయిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ సంజయ్ అగర్వాల్ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం ఇప్పటికే అధ్యయనం జరిపిందని గుర్తుచేశారు.
నీటిలో సిలికా, స్ర్టోటియం, గ్యాలియం శాతం ఎక్కువగా ఉండటం వ్యాధికి ఒక కారణంగా ప్రాథమికంగా గుర్తించినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి చెప్పారు. సిలికా ప్రభావం ఉన్న గాలిని పీల్చడం మరో కారణమన్నారు. అధిక ఉష్ణ వాతావరణంలో పనిచేస్తూ సరిపడినంత నీరు తీసుకోకపోవడం, డీహైడ్రేషన్‌కు గురికావడం, పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడటం వల్ల కిడ్నీ వ్యాధి ప్రభావం కనిపిస్తున్నట్టు నిపుణులు నిర్ధారించారన్నారు. రూ.17.30 కోట్ల వ్యయంతో ఉద్ధానం ప్రజానీకానికి పరిశుద్ధ జలాలు అందించే ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. ఈ ఆర్వో ప్లాంట్ల ద్వారా 147 గ్రామాలకు రక్షిత మంచినీటి సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది జనవరిలో 5 మండలాలలోని ప్రజలకు రూ. 10.69 కోట్లు వ్యయంతో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటుచేశామన్నారు. పలాస, వి.కొత్తూరు, సోంపేట, కవిటి, కంచిలి మండలాల్లో తొలుత ప్రాజెక్టుల ఏర్పాటుచేసినట్టు చెప్పారు. మిగిలిన 2 మండలాల్లోని మరో 7 చోట్ల 7 ఆర్వో ప్లాంట్ల నిర్మాణానికి ఆదేశాలిచ్చామని వివరించారు.
హార్వర్డ్ మెడికల్ స్కూల్ బృందంలో డాక్టర్ జోసెఫ్, టీసీ అశోక్, హరిప్రసాద్, అశోక్ యాదవ్, కృష్ణమూర్తి, రాజేశ్ తదితరులు ఉన్నారు. వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ రవిరాజు, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ సుజాత శర్మ, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శులు గిరిజాశంకర్, రాజమౌళి ఈ సమావేశంలో పాల్గొన్నారు.