ప్రభుత్వ కార్యాలయాలు ఆధునీకరించ బడ్డాయి అంటే ప్రజా సేవలు సులభతరం కాబడ్డాయి అని అర్ధం...
రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ నూతన భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. 150 ఏళ్లకు గుర్తుగా భవనం ఆవరణంలో ఏర్పాటు చేసిన స్మారక చిహ్నాన్ని ఆయన ఆవిష్కరించారు.
పక్కన ఏర్పాటు చేసిన నూతన భవన శిలాఫలకం, మున్సిపల్ ఆవరణం బయట ఉన్న విద్యుత్తు ఉప కేంద్రం మార్పు చేసేందుకు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అక్కడ నుంచి నేరుగా నూతన భవనంలోకి ప్రవేశించారు.
వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ముఖ్యమంత్రిని నగరపాలక సంస్థ పాలకవర్గం, అధికారులు స్వాగతం పలికారు. లోపలకు వెళ్లగానే నేరుగా పై అంతస్తుకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్రూంను పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూం ఆవశ్యకతను కమిషనర్ విజయ్రామరాజు వివరించారు.
నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీతోపాటు, పురపాలకసంస్థ చేపట్టే పనులు, చెత్త సేకరణ, ఇతర అభివృద్ధి పనులు ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే మేయర్ ఛాంబర్ను పరిశీలించారు. చివరిగా కింది అంతస్తులో ఏర్పాటు చేసిన బుధుడి విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు.
రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ నూతన భవనాన్ని విద్యుత్తు దీపాలతో సుందరంగా తీర్చి దిద్దారు. దారిపొడవునా విద్యుత్తు దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అలాగే నగర జిల్లా పోలీస్ నూతన కార్యాలయ భవన సముదాయాన్ని , సిఐడి ప్రాంతీయ నూతన భవనాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు.