కేంద్రం నిధులు విడుదలలో అలసత్వం... కాంట్రాక్టు సంస్థ నిర్లిప్తత తోడై, విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు సాగుతూనే ఉన్నాయి... చంద్రబాబు పరిపాలన దక్షతకు సవాల్ గా ఉన్న ఈ ఫ్లై ఓవర్, అటు ప్రభుత్వానికి, ఇటు చంద్రబాబు ఇమేజ్ కి కూడా చెడ్డ పేరు తీసుకువస్తుంది.. ఫ్లై ఓవర్ పనులు గురించి, ఇవాళ చంద్రబాబు సమీక్ష నిర్వహించారు...
కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటి కల్లా ఫ్లైఓవర్ నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని నిర్మాణ సంస్థకు గడువు విధించారు. శనివారం తన కార్యాలయంలో కనకదుర్గ ఫ్లైఓవర్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి పనులు మందకొడిగా సాగిస్తూ నిర్మాణ సంస్థ ‘సోమా’ ఇప్పటికే ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందిని పెంచి, ఇక నుంచి 24 గంటలు పగలు రాత్రి పనులు కొనసాగించాలని స్పష్టం చేశారు. పనులు ఆలస్యం చేస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు.
కనకదుర్గ ఫ్లైఓవర్ పనులకు అంతరాయం కలుగకుండా, శరవేగంగా నిర్మాణం పూర్తి చేసేందుకు ఈనెల 11న ఉదయం 6 గంటల నుంచి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు దుర్గగుడి రహదారిని మూసివేయాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. దసరా శరన్నవరాత్రులను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఈనెల 20 నుంచి 30 వరకు మాత్రం నడకదారికి అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు.
రహదారి మూసివేసిన అన్ని రోజులు పాసుల పేరుతో ఏ ఒక్కరికీ ప్రవేశానికి అనుమతి ఇవ్వొద్దని తేల్చిచెప్పారు. ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయ్యేవరకు రెండువైపులా శాశ్వత ప్రాతిపదికన బారికేడ్లు నిర్మించే ఆలోచన చేయాలని సూచించారు.
దుర్గగుడి రహదారి మూసివేయనుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలు అభివృద్ధి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రహదారులపై రద్దీ నిర్వహణ సమర్ధంగా జరగాలని చెప్పారు. సితార జంక్షన్ దగ్గర రహదారికి విస్తరణ చేపట్టామని, ఇప్పటికే అవసరమైన మరమ్మతులు పూర్తి చేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
కేఈ ప్రధాన కాలువ బంద్
కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం నవంబర్ 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 15 వరకు, అలాగే 2018 ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు కేఈ ప్రధాన కాలువ ప్రవాహాన్ని నిలిపివేస్తామని అధికారులు ప్రకటించారు. అటు దుర్గగుడి సమీపంలోని ఏపీ ట్రాన్స్‌కో సబ్ స్టేషన్ తరలింపు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.