నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాలుగా నిలవనున్న సచివాలయ టవర్ల నిర్మాణం వేగం పుంజుకుంది. నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికుల్లో అత్యధికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో ఎన్నికల్లో ఓటేయడానికి సొంతూళ్లకు వెళ్లారు. దీంతో పనులు కొద్దివారాలపాటు నెమ్మదించాయి. అలా సొంతూళ్లకు వెళ్లిన కార్మికులు అమరావతికి తిరిగొస్తుండటంతో నిర్మాణాలు పూర్వపు వేగం అందుకున్నాయి. వర్షాలు ప్రారంభమయ్యేనాటికి చుట్టూ నీరు చేరకుండా రిటైనింగ్ వాల్స్‌ను కట్టనున్నారు. ఇందుకోసం సాధ్యమైనంత ఎక్కువ పని చేయాలన్న లక్ష్యంతో కాంట్రాక్ట్ సంస్థలతో ఏపీసీఆర్డీయే వేగంగా పని చేయిస్తోంది. ఇప్పటికే టవర్-2కు సంబంధించిన రిటైనింగ్ వాల్ నిర్మాణం ప్రారంభమైంది. మిగిలిన 4 టవర్లకు చెందిన వాటిని కూడా త్వరలోనే మొదలు పెట్టేందుకు సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. మరొకపక్క.. బ్యాంకులు, రెస్టారెంట్లు, తపాలా కార్యాలయాల్లాంటి ప్రజా వసతుల కోసం నిర్మించనున్న ‘నాన్ కోర్ ఏరియా’ పనులూ వేగంగా జరుగుతున్నాయి.
సుమారు రూ.3,500 కోట్ల అంచనా వ్యయంతో, 69లక్షల చ.అ. భారీ విస్తీర్ణంతో, 5టవర్లుగా శాశ్వత సెక్రటేరియట్ నిర్మాణం కానున్న సంగతి తెలిసిందే. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ సముదాయం విస్తీర్ణం 6లక్షల చదరపు అడుగులే. దీనినిబట్టి శాశ్వత సచివాలయం ఎంతటి భారీదో ఊహించుకోవచ్చు. వచ్చే ఏడాది అక్టోబరుకల్లా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సెక్రటేరియట్ టవర్లలో సచివాలయంతోపాటు సుమారు 145 విభాగాధిపతుల కార్యాలయాలుంటాయి. దేశంలో ఇదే మొదటిది. మొత్తం ఐదు టవర్లలో సీఎం, సీఎస్ ఉంటే జీఏడీ టవర్ 50 అంతస్తులతో, మిగతా నాలుగూ 40 టవర్లతో ఉంటాయి. పైన హెలిప్యాడ్ ఉండే జీఏడీ టవర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన (225 మీటర్లు) సచివాలయ భవనంగా నిలవబోతోంది.
కోర్ వాల్ చుట్టూరా ఉండే ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేదికగా డయాగ్రిడ్ స్టీల్ కాలమ్స్ ఏర్పాటు చేసే పని కూడా వేగంగా సాగుతోంది. 15 నుంచి 18 టన్నుల బరువుండే ఈ భారీ కాలమ్స్ తయారీని భారత్‌కు చెందిన జేఎ్‌సడబ్ల్యూ సంస్థ, గల్ఫ్‌కు చెందిన ఎవర్ సెండాయ్ కంపెనీ చేపట్టాయి. 1, 2, 3, 4 టవర్లలో ఒక్కొక్కదానిలో అమర్చే కాలమ్స్‌లో వినియోగించే అత్యంత పటిష్ఠమై ఈ350బీఆర్ రకం స్టీల్ బరువు 10,000 టన్నుల నుంచి 12,000 టన్నుల వరకు, 50 అంతస్తులుండే 5వ టవర్‌లో 15,000 టన్నుల వరకు ఉండనుంది. 1, 2 టవర్లకు అవసరమైన స్టీల్ కాలమ్స్‌ను జేఎ్‌సడబ్ల్యూ బళ్లారిలో ఉన్న తమ కర్మాగారంలో తయారు చేసి, అమరావతికి చేర్చుతోంది. ఈ సంస్థలు స్టీల్ కాలమ్స్‌తోపాటు డయాగ్రిడ్ వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన ఇతర స్టీల్ ఉత్పత్తులను కూడా రూపొందిస్తున్నాయి. కాగా, టవర్ల నిర్మాణం పూర్తి ప్రణాళికాబద్ధంగా, లోపరహితంగా, సంపూర్ణ నాణ్యతా ప్రమాణాలతో జరిగేలా చూసేందుకు సీఆర్డీయే ఇంజినీర్లు, ఉన్నతాధికారులు ప్రతినిత్యం ప్రాజెక్ట్ సైట్లోనే నిపుణులతో వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు.