నాలుగేళ్లుగా టిడిపి నేతలందరిపైనా కేసులు పెట్టేసిన వైసీపీ పెద్దలు ఏ ఒక్క కేసు నిలబడకపోవడంతో కొత్త మార్గం ఎంచుకున్నారు. తీవ్రమైన ప్రజావ్యతిరేకత నుంచి ఘోర ఓటమి తప్పదనే సంకేతాలు నేపథ్యంలో వైఎస్ జగన్ రెడ్డి ముందు ఇప్పుడు రెండే దారులు కనపడుతున్నాయి. టిడిపిని తన వ్యూహాలతో ఉరకలెత్తిస్తున్న చంద్రబాబుని ఏదో ఒక కేసులో అరెస్టు చేయించి జైలుకి పంపిస్తేనే, టిడిపి స్పీడుని ఆపొచ్చనేది మొదటి జగన్ వ్యూహంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే చంద్రబాబుని అరెస్టు చేయించేందుకు సరిపడా ఏ కేసులోనూ ఆధారాలు చిక్కడంలేదు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం, ఫైబర్ నెట్ కుంభకోణం, రాజధాని భూములు, అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు, సచివాలయం నిర్మాణ సంస్థతో లాలూచీ అంటూ కొత్త వాదన, ఐటీ కేసులంటూ ఎన్ని తవ్వితీసినా చంద్రబాబుకి నోటీసు ఇచ్చే ఆధారాలు కూడా ఏమీ దొరక్కపోవడంతో ఏమీ చేయాలో పాలుపోక జగన్ రెడ్డి గందరగోళానికి గురవుతున్నాడని తాడేపల్లి ప్యాలెస్ వర్గాల భోగట్టా. మూడు పట్టభద్రుల స్థానాల్లో జెల్ల కొట్టిన చంద్రబాబు పంచుమర్తి అనూరాధ రూపంలో మరో పంచ్ విసిరారు. ఈ వరస దెబ్బలతో అల్లాడిపోతున్న జగన్ రెడ్డి ఏకంగా చంద్రబాబుని అరెస్టు చేయించాలనే బరితెగింపు వ్యూహానికి దిగారు. అయితే ఏ కేసులో ఏ ఆధారాలు లేకపోవడంతో ఉన్నతాధికారులు అటువంటి అరెస్టుకి దిగితే తాము దోషులైపోతామని లబోదిబోమంటున్నారట. మరోవైపు ప్రజావ్యతిరేకత, ఉద్యోగుల ఉద్యమం, ప్రతిపక్షం బలోపేతం అన్నింటినీ బేరీజు వేసుకుని...మరింత కాలం పదవిలో మరింత వ్యతిరేకత పెరుగుతుందని..175 మాటేమో కానీ, ఉన్న 151లో 88 వచ్చినా అధికారం నిలబెట్టుకోవచ్చనే ఆలోచనలో ముందస్తుకి వెళ్లాలనే ఆలోచనని ఢిల్లీ పెద్దల వద్ద పెట్టారని మరో సమాచారం బయట చక్కర్లు కొడుతోంది.
news
అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ రివర్స్.. జగన్ స్కెచ్ వర్కవుట్ అయ్యిందా?
వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టు భయంతో నిన్నటివరకూ వణికిపోయిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పుతో ఒక్కసారిగా రిలీఫ్‌గా ఫీలవుతున్నారా? తన తమ్ముడు అరెస్టు కాకుండా జగన్ రెడ్డి ఇటీవల చేసిన రెండు సార్లు ఢిల్లీ పర్యటనలు వర్కవుట్ అయ్యాయా? అంటే అవుననే విధంగా పరిణామాలు చాలా స్పీడుగా మారాయి. నిన్ననే ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన అవినాశ్ రెడ్డి, ఒక్క రోజులోనే ముందస్తు బెయిల్ పిటిషన్ రివర్స్ తీసేసుకున్నారు. దర్యాప్తు అధికారిని మార్చాలని పదేపదే డిమాండ్ చేసిన అవినాష్ రెడ్డి , దర్యాప్తు అధికారి మారడేమో అని అనుమానంతో వివేకా హ-త్య కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని, అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తు అధికారి మారిపోవడంతో అవినాష్ రెడ్డి 24 గంటలు గడవకముందే తన ముందస్తు బెయిల్ పిటిషన్‌ని వెనక్కి తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. మూడుసార్లు సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి ఇక తన అరెస్టు తప్పకపోవచ్చని డిసైడయ్యారు. ఆందోళనలో ఉన్న అవినాశ్ రెడ్డిని సముదాయంచిన జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చాక కాస్తా రిలీఫ్ గా ఉన్నారని వైసీపీ ప్రచారం సాగుతోంది. తన అన్న జగన్ రెడ్డి కేసు ముందుకు సాగకుండా అన్నీ చూసుకుంటాడనే ధీమాతో అవినాశ్ రెడ్డి ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసు విచారణకి నెల రోజులే గడువు ఉండడం, తమకు అనుకూలం కానుందనే ఆనందంలో అవినాష్ రెడ్డి ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
సీబీఐ రాం సింగ్ తప్పించినా, అవినాష్ అరెస్టుని ఆపగలరా?
అందరూ అనుమానించిందే జరిగింది. వివేకానందరెడ్డి హ-త్యకేసుని దర్యాప్తు చేస్తున్న రాంసింగ్ బదిలీ చేయాలని మొదటి నుంచి వైఎస్ అవినాశ్ రెడ్డి క్యాంపు డిమాండ్ చేస్తోంది. రాంసింగ్ పై గతంలో అవినాష్ మనుషులు కేసులు కూడా పెట్టారు. పులివెందుల వదిలి వెళ్లిపోవాలని సీబీఐ అధికారి డ్రైవర్నీ బెదిరించారు. చివరికి దర్యాప్తు అధికారిని మార్చాలని కోర్టుకెక్కి విజయం సాధించారు. వివేకానంద రెడ్డి హ-త్య కేసు దర్యాప్తునకు సుప్రీంకోర్టు డెడ్‌లైన్ ఇచ్చింది. ఏప్రిల్ 30 లోగా పూర్తి చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు, ఈ హ-త్య కేసులో విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టాలని సూచించింది. అనుమానితులు కోరుకున్నట్టే సీబీఐ అధికారి రాంసింగ్ లేకుండా కొత్త సిట్ ని ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు ముందు ఉంచింది. కొత్త సిట్‌లో ఎస్పి వికాస్ సింగ్, అడిషనల్ ఎస్పీ ముకేష్ కుమార్, ఇన్స్పెకర్లు ఎస్.శ్రీమతి, నవీన్ పునియా, సబ్ ఇన్స్పెక్టర్ అంకిత్ యాదవ్‌లు సిబిఐ డిఐజి కేఆర్ చౌరాసియా నేతృత్వంలో పనిచేస్తారు. దర్యాప్తు నుంచి ప్రస్తుత దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను సిబిఐ తప్పించింది. ఆరు నెలలోపు ట్రయల్ మొదలుకాక పోతే... శివశంకర్ రెడ్డి ట్రయల్ కోర్టులో సాధారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని, వివేకా హ-త్యకేసు నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విచారణ అధికారి రాంసింగ్ ని తప్పించినా, అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కి దరఖాస్తు చేయడంతో అరెస్టుని ఆపలేకపోవచ్చని, దర్యాప్తుని ఏప్రిల్ 30లోగా పూర్తి చేయాల్సి ఉన్నందున మూడుసార్లు విచారణకి వచ్చిన అవినాష్ రెడ్డి అరెస్టు తప్పకపోవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
వైరాగ్యంలో విజయసాయిరెడ్డి.. గ్రేట్ఆంధ్ర ఒక్కటే మద్దతు
వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అంటే సోషల్ మీడియాలో ఒక బ్రాండ్. బూతులు, రోత ట్వీట్లు, పోస్టులకి విజయాసాయిరెడ్డి హ్యాండిల్ బాగా ఫేమస్. లెక్కకుమించిన పదవులున్నా వైసీపీ సోషల్‌మీడియా ఇన్చార్జిగా సాయిరెడ్డి బూతు కూతలు, ``ఏ`` సర్టిఫికెట్ రెట్టలతో నిత్యం అందరితోనూ ఛీకొట్టించుకుని వార్తల్లో ఉండేవారు. ఇటీవల కాలంలో విజయసాయిరెడ్డి నుంచి ఒక్కో పోస్టూ పీకేస్తూ వచ్చిన జగన్ రెడ్డి, ఓన్లీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిగా మిగిల్చారు. సోషల్ మీడియా బాధ్యతలు సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ రెడ్డికి అప్పగించారు. బోధివృక్షం కింద బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్టు, తన అల్లుడు వరసైన తారకరత్న మరణం సందర్భంలో సాయిరెడ్డికి జ్ఞానోదయం అయ్యింది. టిడిపి గొప్పతనమేంటో అర్థమైంది. తన బిడ్డ అలేఖ్యరెడ్డి అన్న సంగతి మరిచిపోయి వైసీపీ సోషల్‌మీడియా తారకరత్న మరణంపై విషం చిమ్మడంతో సాయిరెడ్డి తీవ్ర మనోవేదనకి గురయ్యారని సమాచారం. తన పదవులు పీకేసినా దానికంటే ఎక్కువ బాధపడ్డారని తెలుస్తోంది. అలాగే సోషల్ మీడియాలో సాయిరెడ్డి మనుషులు హర్షవర్థన్ రెడ్డితో సహా అందరినీ సజ్జల భార్గవరెడ్డి టీము తొక్కేసిందని తెలుస్తోంది. దీంతో సాయిరెడ్డి పూర్తి వైరాగ్యంలోకి వెళ్లిపోయారని సన్నిహితులు చెబుతున్న మాట. ట్వీట్లు, పోస్టులు కూడా పూర్తిగా మారిపోయాయి. అంతర్జాతీయ, జాతీయ వ్యవహారాలు-ఆవు కతలే రోజూ పోస్టు చేస్తున్నారు అడ్మిన్. వైసీపీ నేతల పుట్టినరోజు శుభాకాంక్షలు అదనం. రోత పోస్టులు అస్సలు వేయడంలేదు. మరోవైపు గతంలో ఇంటూరి రవికిరణ్ బరితెగింపు మార్ఫింగ్ పోస్టులు కూడా సాయిరెడ్డి అక్కౌంట్ల నుంచి షేరయ్యేవి. సైరా పంచ్ పేరుతోనూ, పొలిటికల్ పంచ్ పేరుతో అసభ్యపు పోస్టులనూ సాయిరెడ్డి ఖాతా నుంచి వేసేసేవారు. ఇప్పుడు సాయిరెడ్డి సోషల్ మీడియా ఖాతాలు పంచ్ నుంచి బయటపడి గ్రేట్ ఆంధ్రా వెంకటరెడ్డికి చేరాయని తెలుస్తోంది. సాయిరెడ్డి హ్యాండిల్లో పోస్టు చేసినవే గ్రేట్ ఆంధ్రలోనూ అక్షరం పొల్లు పోకుండా పోస్టవుతున్నాయి. దీంతో సాయిరెడ్డి రాతలే కాదు సోషల్‌మీడియా టీము కూడా మారిపోయిందని తెలుస్తోంది.