ప్రధాని రాష్ట్రానికి చేస్తున్న మోసం పై అన్ని విధాలుగా చంద్రబాబు పోరాడుతున్నారు. మంత్రులని బయటకు తీసుకురావటం, ఎన్డీఏ నుంచి బయటకు రావటం, ధర్మ పోరాట దీక్షలు, ఢిల్లీలో ఆందోళనలు, దేశంలో అన్ని పార్టీల మద్దతు, అవిశ్వాసం, ఇలా అన్ని విధాలుగా పోరాడుతున్న చంద్రబాబు, తాజగా కడప ఉక్కు పరిశ్రమ సాధనకు పోరాటం మరింత తీవ్రం చేయాలని భావిస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో ఆగస్టు 1న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనుంది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు ఆదేశాల ప్రకారం, రాష్ట్రపతి, కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలవాలని కడప జిల్లా తెదేపా నేతలు నిర్ణయించారు.
కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం ప్రభుత్వం జూన్12న సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి నిరాహార దీక్ష చేసినా కేంద్రం స్పందించలేదు. రెండు నెలల్లో కడప ఉక్కు పరిశ్రమపై కేంద్రం ప్రకటనలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే పరిశ్రమ ఏర్పాటు చేస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించి దీక్ష విరమింపజేశారు. నెలరోజులైనా కేంద్రం నుంచి ఎలాంటి స్పందనలేదు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాల్లో తెదేపా ఎంపీలు పోరాటం చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు.
సీఎం రమేష్‌తో పాటు ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి కడపలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉక్కు పరిశ్రమ సాధనకు కేంద్రంపై ఒత్తిడి పెంచేలా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే అంశం పై చర్చించారు. చంద్రబాబు సూచనలు ప్రకారం, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున జాతీయ పార్టీలను కలిసి సమస్యలను ప్రస్తావించాలని నిర్ణయించారు. కడప జిల్లా తెదేపా నాయకులు అఖిలపక్షం, ప్రజా సంఘాలతో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఆగస్టు 1న దిల్లీ వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను, ఉక్కుశాఖ మంత్రి బీరేంద్రసింగ్‌ను కలవాలని నిర్ణయించారు. ఉక్కు పరిశ్రమ కోసం తెలుగుదేశం పోరాటం చేస్తుంటే వైకాపా మాత్రం పట్టించుకోవడంలేదని సీఎం రమేష్ విమర్శించారు.