నేడు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని ఈరోజు మూసివేయనున్నారు. ఈ శతాబ్దిలోనే ఇది అతి సుదీర్ఘమైనదిగా పండితులు చెబుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని ఆలయాలను మూసివేయనున్నారు. చంద్రగ్రహణంతో శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే అన్నప్రసాదం, లడ్డూ వితరణ కేంద్రం కూడా మూసివేయనున్నారు. దాంతో ఈరోజు వృద్ధులు, వికలాంగులకు దర్శనాలను రద్దు చేశారు. ఆలయశుద్ధి, పుణ్యావచనం తర్వాత శనివారం ఉదయం 4.30 గంటలకు తిరిగి శ్రీవారి ఆలయాన్ని టీటీడీ అధికారులు ఆలయాన్ని తెరవనున్నారు.
చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయంలో గ్రహణ కాలాభిషేక పూజలు నిర్వహించడంతో పాటు ఆలయాన్ని శుక్రవారం యథావిధిగా తెరిచి ఉంచనున్నారు. శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఉభయ దేవాలయాల్లో శనివారం ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనాలు, ఆర్జిత సేవలు నిర్వహించుకునే అవకాశం కల్పిస్తారు. . దేశవ్యాప్తంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం పాక్షికంగా కనిపించనుంది. గ్రహణం మొదలైన తర్వాత ఏదైనా తింటూ సెల్ఫీలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు అప్లోడ్ చేయాలని, తద్వారా మూఢనమ్మకాలను పారద్రోలాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.