ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన వారే నిజమైన హీరోలని, డ్రామాలు ఆడేవారు ఎప్పుడూ జీరోగానే మిగులుతారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటంపై ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడిందని, అన్యా యాన్ని సరిదిద్దుతారనే విశ్వాసం వచ్చిందని అన్నారు. భాజపా ఎంపీలు సభ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ప్రజల దృష్టిలో వారు మోసగాళ్ళయ్యారని అనారు. ఎక్కడ ఏ చిన్న అవకాశం లభించినా ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై ధ్వజమెత్తాలని పేర్కొన్నారు. ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని తన నివాసం నుంచి టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిన్న రాజ్యసభలో కేంద్రాన్ని నిలదీసిన తీరు అద్భుతంగా ఉందని ఎంపీలను ప్రశంసించారు.
బీజేపీ మినహా అన్ని పార్టీలు రాష్ట్రానికి మద్ధతుగా నిలిచాయని, వారి సహకారంతో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని సూచించారు. రాజ్య సభలో జరిగిన చర్చ ద్వారా దేశాన్ని మెప్పించగలగడంతోపాటు వివిధ పార్టీలను ఒప్పించగలిగామని అన్నారు. రాష్ట్రానికి అండగా నిలిచిన పార్టీలకు లేఖల ద్వారా ధన్యవాదాలు తెలియజేయనున్నట్లు చెప్పారు. పార్లమెంట్‌లో చేస్తున్న పోరాటం ఇక పై కూడా కొనసాగుతుందని ఇప్పుడు మిగిలిన పార్టీలు ఏ విధంగా సహకరిస్తున్నాయో భవిష్యత్‌లో కూడా అదే విధంగా ఉండేలా కృషి చేయాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. గాంధీ విగ్రహం వద్ద నిరసనలు కొనసాగించాలని, ఇవి కళారూపాల్లో ఉండాలని నిర్ధేశించారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ఆయా మంత్రిత్వ శాఖల వద్ద ఆందోళనలు చేయాలన్నారు. అన్యాయాన్ని తెలుగుదేశం పార్టీ సహించదనే విషయం ప్రజల్లోకి వెళ్ళిందని, దీన్ని ఇకపై కూడా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
లోక్‌సభలో ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, రాజ్యసభలో వై.ఎస్.చౌదరి, సీఎం రమేష్ ప్రసంగాలకు మంచి స్పందన వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రతిపక్ష నేత జగన్ నిరాశ, నిర్వేదంతో వ్యక్తిగత విమర్శలు, నిందలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. కొత్త సభ్యులు తమ మెయిడెన్ స్పీచ్‌లో కూడా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించి కేంద్రం వైఖరిని ఎండగట్టాలని సూచించారు. రాజధాని నిర్మాణం, కడప ఉక్కు, విశాఖ రైల్వేజోన్ అంశాలపై పోరాటాన్ని మరింత ఉదృతం చేయాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. కాంగ్రెస్ నేతల ప్రసంగాలు వారి పై ప్రజల్లో ఉన్న ధ్వేషాన్ని తగ్గించాయని, బీజేపీ నేతల ప్రసంగాలు వారి అహాన్ని ప్రస్పుటించాయన్నారు. 90 శాతం హామీలు నెరవేర్చామని బీజేపీ నేతలు పచ్చి అబద్దాలు మాట్లాడారని అదే విధంగా 14వ ఆర్థిక సంఘం హోదా ఇవ్వడం కుదరదని చెప్పినట్లు వారు అసత్య ప్రచారాలకు పాల్పడ్డారన్నారు. వీటిపై ఫ్రివిలేజ్ మోషన్స్ ఇచ్చే అంశాన్ని పరిశీలించి, మిగిలిన పార్టీల మద్దతును సమీకరించాలని ఎంపీలకు అధినేత చంద్రబాబు సూచించారు.