విభజన చట్టం అమలుపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశమైంది. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర హోం, జలవనరులు, ఆర్థిక, పట్టణాభివృద్ధి శాఖల అధికారులు హాజరయ్యారు. ఏపీ నుంచి ఎంపీ రామ్మోహన్నాయుడు, ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు కుటుంబరావు, అధికారులు ఆదిత్యనాథ్‌దాస్, రవిచంద్ర, ప్రవీణ్‌ప్రకాష్, ప్రేమ్‌చంద్రారెడ్డి హాజరైనారు. . రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు.. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్సింగ్ విడిగా ప్రకటన రూపంలో ఇచ్చిన హామీలు.. వాటి అమలు తీరు, టీడీపీ లోక్‌సభలో అవిశ్వాసం నోటీసు ఇవ్వడానికి కారణాలు, రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి ప్రజెంటేషన్ వివరించారు.
కమిటీ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కోసం విభజన వ్యవహారాలు చూస్తున్న అధికారి ప్రేమ్‌చంద్రారెడ్డి, ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర, మౌలిక వసతుల కార్యదర్శి అజయ్ జైన్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ తదితరులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘ప్రధాని పార్లమెంటులో ప్రకటన చేసినా.. హామీ ఇచ్చినా దానికి చాలా విలువ ఉంటుంది. వాటిని అమలు చేయకపోవడం ఏమిటి’ అని చిదంబరం విస్మయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సమావేశానికి కేంద్ర శాఖల అధికారులూ హాజరయ్యారు. వారి వాదనను కూడా కమిటీ నమోదు చేసుకుంది.
అయితే ఒక సందర్భంలో, టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు, చిదంబరం పై ఫైర్ అయ్యారు. ‘అసెంబ్లీ సీట్ల పెంపును రాజ్యాంగం నిబంధనలు అంగీకరించవు. 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన కుదరదు’ అని చిదంబరం పేర్కొన్నారు. దీని పై సంఘం సభ్యుడు, టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. రాజ్యాంగం అంగీకరించనప్పుడు చట్టంలో ఎందుకు పెట్టారని గట్టిగా ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇవ్వకుండా చిదంబరం మౌనం దాల్చినట్లు సమాచారం. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలను ఇప్పుడున్న 175 నుంచి 225కి పెంచాలని విభజన చట్టంలో పేర్కొన్నారని.. కానీ కేంద్రం ఇంతవరకు ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆంధ్రప్రదేశ్ అధికారులు వివరిస్తున్న సమయంలో చిదంబరం జోక్యం చేసుకుంటూ పై వ్యాఖ్యలు చేశారు.