పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం పై ఫైర్ అయ్యారు చంద్రబాబు. మనల్ని యూటర్న్ తీసుకున్నారు అంటున్నారని, మనది ఎప్పుడు సరైన దారే అని, ప్రజల దారే మన దారని అన్నారు. యూటర్న్ తీసుకుందే బీజేపీ అని అన్నారు. ఏపీకి ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకోవడం, మేనిఫెస్టోలో చెప్పింది చేయకపోవడం, పదేళ్లు హోదా ఇస్తామని చెప్పి... ఇప్పుడు కుదరదని చెప్పడం.. ఇవన్నీ యూటర్న్ కాదా? అని ప్రశ్నించారు. దిల్లీ-ముంబై కారిడార్‌పై శ్రద్ధ చూపిస్తున్న కేంద్రం.. విశాఖ-చెన్నై కారిడార్‌ను గాలికొదిలేస్తోందని, గుజరాత్‌లోని థొలెరా నగరానికి పుష్కలంగా నిధులిచ్చి అమరావతికి అన్యాయం చేయడం వంటివి యూ టర్న్ కాక మరేంటని ప్రశ్నించారు.
‘మన సంపద కావాలి, మన వనరులు కావాలి..కానీ మనకిచ్చిన హామీలు నెరవేర్చరు, విభజన చట్టాన్ని అమలు చేయరు’అని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, కేంద్రం చర్యలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని ఎంపీలకు సూచించారు. ఒంగోలు ధర్మపోరాట సభకు ఎంపీలు హాజరుకావాలని ఆదేశించారు. భవిష్యత్ పోరాటానికి మరింత ఉత్తేజితులు కావాలని సీఎం పిలుపునిచ్చారు. టీడీపీని దెబ్బతీయడానికి కుట్రలు చేస్తారా అంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. మూడు పార్టీలు కలిసి లాలూచీ చేస్తారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పోరాటం పెంచినప్పుడల్లా లాలూచీపరులతో పోటీ కార్యక్రమాలు పెట్టిస్తారా అని, ఒంగోలు ధర్మపోరాట సభ రోజే మరోచోట పోటీ దీక్షలు చేయిస్తారా అంటూ ప్రశ్నించారు. బీజేపీ, వైసీపీ, జనసేన మూడు పార్టీల లాలూచీ బయటపడిందని, అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
పార్లమెంటులో టీడీపీ ఎంపీల పోరాటంపై ప్రజల్లో ప్రశంసలు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని అత్యున్నత చట్టసభల్లో ఎండగట్టారని, తమకు అప్పగించిన బాధ్యతను టీడీపీ ఎంపీలు పకడ్బందీగా నిర్వర్తించారని తెలిపారు. పార్లమెంటులో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారన్నారు. జీరో అవర్, ప్రశ్నోత్తరాలు, స్వల్పకాలిక చర్చల్లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరించారని ఎంపీలతో చంద్రబాబు అన్నారు. కేంద్రం ఒంటెత్తు పోకడలపై టీడీపీ ఎంపీలు ధ్వజమెత్తారని అభినందించారు. బీజేపీ అవకాశవాద రాజకీయాలను ఎంపీలు ఎండగట్టారని అన్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని, బీజేపీ చేసిన అన్యాయాన్ని వదిలిపెట్టే ప్రసక్తేలేదని సీఎం స్పష్టం చేశారు.