ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని, అలాగే విభజన హామీల గురించి కూడా చర్చించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం ఎంపీలు రాజ్యసభలో ఆందోళన చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లి మరీ నిరసనలు తెలపడం, నినాదాలు చేయడంతో మధ్యాహ్నానికి ముందే సభను రెండుసార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే, ఏపీ విభజన సమయంలో పార్లమెంట్ తలుపులు మూసి, ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసిన సంఘటన మరోసారి గుర్తు చేసారు వెంకయ్య. సోమవారం రాజ్యసభలోనూ అరగంట పాటు ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయించి సభా కార్యక్రమాలను కొనసాగించారు. టీడీపీ సభ్యులు సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఛైర్మన్ వెంకయ్యనాయుడు సుమారు 30 నిముషములపాటు ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయించారు.
ఏపీ సమస్యలపై స్వల్పకాలిక చర్చకు టీడీపీ, వైసీపీ సభ్యులు పదే పదే పట్టుపట్టారు. ఈ అంశంపై, ఇప్పటికే బీఏసీ సమావేశంలో చర్చించినట్లు వెంకయ్య వెల్లడించారు. ఆ తర్వాత వరికి కనీస మద్దతుధరపై అన్నాడీఎంకే సభ్యుడు విజిల సత్యనాథ్, ప్రభుత్వ నిఘా సంస్థలను ప్రభుత్వం రాజకీయ ప్రతీకారాలకు వాడుకుంటోందన్న అంశంపై కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ఇచ్చిన ఇచ్చిన నోటీసులను జీరో అవర్‌లో చర్చకు చేపట్టారు. ఆయన ఆ విషయం చెప్పగానే టీడీపీ సభ్యులు పలువురు వెల్‌లోకి దూసుకె ళ్లారు. ఈ అంశాలపై పూర్తిస్థాయి చర్చ చేపట్టాలని వారు డిమాండు చేయగా, వెంకయ్యనాయుడు మాత్రం రూల్ 176 కింద స్వల్పకాలిక చర్చకు అనుమతించారు.
విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యల పై ఇవాళ రాజ్యసభలో జరగాల్సిన స్వల్పకాలిక చర్చ రేపటికి వాయిదా వేసారు. విభజన చట్టం అమలు చేయాలని, ఏపీకి ప్రత్యేక హోదా కేటాయించాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ ఎంపీలు.. ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలను పెద్దల సభలో ప్రస్తావించడానికి సిద్ధపడ్డారు. అయితే స్వల్పకాలిక చర్చను రేపు చేపడతామని వెంకయ్య అన్నారు. సీఎం రమేష్, సుజనా చౌదరిలు చర్చ ఇవాలే చేపట్టాలని డిమాండ్ చేశారు. కానీ సభ్యుల అభ్యర్థనమేరకే చర్చను రేపటికి వాయిదా వేసినట్లు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.