అసాధ్యం సుసాధ్యమవుతుంది.. ఏడున్నర దశాబ్ధాల విఘ్నాలను పోలవరం ఎట్టకేలకు అధిగమిస్తోంది. ఇప్పటివరకు పూర్తయిన 56 శాతం పనుల్లో గడిచిన అయిదు నెలల కాలంలోనే 25 శాతం పనులు జర గడం ఈ ఏడాది పోలవరం పురోగతికి అద్దం పడుతోంది. సాంకేతిక సమస్యల సమాహారంగా మారిన ఈ ప్రాజెక్టు బలారిష్టాలను దాటుతుండడం ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రజల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. నిధుల కేటాయింపులో కేంద్రం కొర్రిలు పెడుతున్నా ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుండడం సర్కార్ సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తోంది. నెలకోసారి సందర్శన, వారం వారం సమీక్షలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాజెక్టు పనులను స్వయంగా పర్యవేక్షిస్తుండడంతో ఎన్నో దశాభ్దాల పోలవరం కల ఏడాదికాలంలోనే సాకారమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దశాబ్దాల కలగా ఉన్న పోలవరంలో ఎట్టకేలకు కదలిక రావడం అందరిలో ఆశలు రేకెత్తిస్తోంది. ఎన్నో ప్రతిపాదనలను, ఎందరో పాలకులను చూసిన పోలవరం ఇన్నాళ్ల కు సగానికిపైగా పనులు పూర్తి చేసుకుంది. ఈ అద్భుతం చూడటానికి, రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. ప్రభుత్వం ఫ్రీగా బస్సులు పెడుతూ ఉండటంతో, రైతులు వచ్చి చూస్తున్నారు. దీంతో పోలవరం సందర్శనకు వచ్చే వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఈవారం 5,709 మంది వివిధ జిల్లాల నుంచి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ ఏడాది ఏప్రిల్ 23 నుంచి ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టును చూసిన వారి సంఖ్య 50 వేలు దాటింది. మూడు నెలల్లో రైతులు, విద్యార్ధులతో సహా 50,878 మంది ఒక ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించడం రాష్ట్ర చరిత్రలో ఇది తొలిసారి.
మరో పక్క నిన్న సోమవారం కావటంతో చంద్రబాబు, పోలవరం పై రివ్యూ చేసారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీలను మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దాలని, కాలనీలు స్వయం సమృద్ధి సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముందుగా నిర్వాసితుల జీవనస్థితిగతులు, వ్యక్తిగత సమాచారంపై అధ్యయనం జరపాలని సూచించారు. మొత్తం 74 కాలనీలకు అవసరమైతే ప్రత్యేకంగా ఐటీడీఏను ఏర్పాటు చేస్తామని, పునరావాసం-పరిహారం కింద మరింత సాయానికి సిద్ధంగా వున్నామని చెప్పారు. లక్ష కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం, మౌలిక వసతులు కల్పిండం కూడా తమదే బాధ్యతని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పటివరకు మొత్తం 56.69% పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే తవ్వకం పనులు 76.30%, కాంక్రీట్ పనులు 30.70% చేపట్టినట్టు తెలిపారు. కుడి ప్రధాన కాలువ 90%, ఎడమ ప్రధాన కాలువ 62.27% నిర్మాణం పూర్తయ్యిందని, అలాగే రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 61.55%, కాఫర్ డ్యాం జెట్ గ్రౌంటింగ్ పనులు 93% చేపట్టినట్టు వెల్లడించారు.