లోక్‌సభలో సమరానికి అధికార, విపక్షాలు సిద్ధమయ్యాయి. మాటల కత్తులు దూసుకోవడానికి వ్యూహాలకు పదును పెట్టుకున్నాయి. తిరుగులేని ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం శుక్రవారం తొలి అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో గురువారం అధికార, విపక్ష శిబిరాలు తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో, మద్దతు కూడగట్టుకోవడంలో తలమునకలయ్యాయి. విభజన చట్టపరంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ అమలులో విఫలమైన కేంద్ర ప్రభుత్వ వైఖరిని దేశవ్యాప్తంగా అందరికీ తెలియజెప్పాలన్న ఉద్దేశంతో తెదేపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఉదయం 11 గంటలకు గల్లా జయదేవ్ ప్రసంగంతో చర్చ మొదలై సాయంత్రం 6కు ముగుస్తుంది.
ప్రతిపక్షాలపై సంఖ్యాపరంగా ఆధిక్యతను నిరూపించేందుకు బీజేపీ వ్యూహకర్తలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ ఎంపీలంతా సభకు రావాలని అధిష్ఠానం విప్ జారీ చేసింది. మధ్యాహ్న భోజనాలు, విందుల ద్వారా నేతలు సంఘటితమై చర్చకు సిద్ధం కావాలని చెప్పింది. సభకు రానివారి పై చర్య తీసుకుంటామని హెచ్చరించింది. అన్నాడీఎంకే, బీజేడీలు మౌనంగా ఉండటంతో ఆ రెండు పార్టీల వ్యూహమేమిటనేది ఆసక్తికరంగా మారింది. అవి కూడా తమకే మద్దతిస్తాయని, తమ బలం 350కి చేరుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్తో కూడా మాట్లాడామని అంటున్నారు. అన్నాడీఎంకే తన సభ్యులకు విప్ జారీ చేయకపోవడం గమనార్హం. విప్ ఎందుకు ఇవ్వలేదో ఎవరికీ అర్ధం కావటం లేదు.
అన్నాడీఎంకే, బీజేడీలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని ఆ రెండు పార్టీల నేతలు అంటున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో పాటు పలువురు మిత్రపక్షాల నేతలతో ఫోన్లో మాట్లాడారు. మొదట ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడిన శివసేన అర్ధరాత్రి ప్లేటు ఫిరాయించింది. మద్దతు విప్‌ను ఉపసంహరించుకుంది. అవిశ్వాసంపై చర్చ సందర్భంగానే వైఖరి చెబుతామని ప్రకటించింది. సెంట్రల్ హాలులో అరుదుగా కనిపించే అమిత్‌షా శుక్రవారం సెంట్రల్ హాలుకు కూడా వచ్చి ఎంపీలతో చర్చలు జరిపారు. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలది అవకాశవాదమని, యూపీఏ హయాంలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో జరిగిందని చెప్పేందుకు బీజేపీ మంత్రులు సిద్ధమవుతున్నారు. ఎన్డీఏలో లుకలుకలు లేవనే విషయాన్ని, ఎన్డీఏను సమర్థించే వారి సంఖ్య పెరుగుతోందని నిరూపించుకోవడానికి ఈ అవిశ్వాసం ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది.