జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలన ఏమి కాని, అటు ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచే కాదు, సొంత పార్టీ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇదేమి పాలన అంటూ బహిరంగంగానే తిట్టి పోస్తున్నారు. నిన్న కాక మొన్న వినుకొండ ఎమ్మెల్యే, బోచ్చుడు ఇసుక కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఎందుకు, ఇసుక లారీలు ఏమై పోతున్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే రఘురామకృష్ణ రాజు, ఇళ్ళ స్థలాల విషయంలో, లంచాల పై దుమ్మెత్తి పోశారు. అయితే, ఇప్పుడు మరో సీనియర్ నేత వంతు. వైసీపీ ఎమ్మెల్యే, రాజకీయాల్లో సీనియర్, మంత్రిగా పని చేసిన ఆనం రామనారాయణ రెడ్డి తన ప్రభుత్వం పైనే సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్టంలో, జిల్లాలో ఉన్న అధికార యంత్రంగం పై విరుచుకుపడ్డారు ఆనం. ఏడాది వైసీపీ పాలనలో, కేకు సంబురాలు బాగా చేసుకున్నారని, ఈ కేకు సంబరాలు తప్ప, తన నియోజకవర్గంలో అభివృద్ధి అయితే శూన్యం అంటూ, తన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి ఈ ఏడాది కాలంలో జరగలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు ఆనం.
ముఖ్యమంత్రి లేకలు రాస్తేనే, దిక్కులేని పరిస్థితిలో ఉంటే ఎలా అని అన్నారు. ఇక్కడ మంత్రులు, అధికారులు, ముఖ్యమంత్రిని కూడా పట్టించుకోవటం లేదని అన్నారు. వైద్య రంగం, విద్యా రంగంతో పాటు, సంక్షేమ పధకాల పై అధికారులను నివేదికలు ఇవ్వమని అడిగినా, ఎవరూ పట్టించుకోవటం లేదని ఆనం అన్నారు. ఇక మరో పక్క, నెల్లూరు జిల్లాలో నీళ్ళు అమ్ముకోవటం పై, ఆనం ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎస్ఎస్ కెనాల్‌ను, పరిశీలించి, తగు చర్యలు తీసుకోవాలని చెప్పినా ఎవరూ పట్టించుకోవటం లేదని అన్నారు. తాను 40 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉన్నానని, ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని ఆనం అన్నారు. నాకు ఎమ్మెల్యే పదవి అలంకారం కాదని, 23 జిల్లాలకు మంత్రిగా చేసానని గుర్తు చేసారు. ఇంకో ఏడాది చూస్తానని, పరిస్థతి ఇలాగే కొనసాగితే, ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వెనుకాడను అంటూ ఆనం సంచలన వ్యాఖ్యలు చేసారు.