రాష్ట్రంలో పనిచేస్తున్న వీవోయే, ఆర్‌పీలకు నెలనెలా రూ.5 వేలు అదాయం అందేలా ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. మహిళా స్వయం సహాయక సంఘాల పొదుపు ఉద్యమంలో ముఖ్య భూమిక వహిస్తున్న వీరందరూ త్వరలో ప్రభుత్వం నుంచి రూ.3వేల గౌరవ వేతనం అందుకుంటారని చెప్పారు. ఈ వేతనంతో పాటు వారు పనిచేసే సంఘాలకు వచ్చే లాభాలను బట్టి నెలకు రూ.2 వేలు మించకుండా ప్రోత్సాహకం ఇస్తామని, ఈ రెండూ కలిపి నెలకు మొత్తం రూ.5వేలు ఆదాయం అందిస్తామని అన్నారు. దీనికోసం రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఉండవల్లి ‘ప్రజావేదిక’ సమావేశ మందిరంలో వి.వో.ఎ., ఆర్.పీ.లతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి సమావేశం జరిపారు.
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో 27,750 మంది గ్రామ సమాఖ్యల సహాయకులు (వీవోయే), పట్టణ ప్రాంతాలలో 8 వేలమంది రిసోర్స్ పర్సన్స్ (ఆర్‌పీ) పనిచేస్తున్నారు. వీరికి నెలనెలా ఎంతో కొంత ఆదాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి గతంలో మెప్మా, డ్వాక్రా అధికారులకు సూచించారు. దీనిపై ప్రభుత్వం కసరత్తు చేసి వీరికి ప్రభుత్వం నుంచి నెలకు రూ.3 వేల గౌరవ వేతనం అందించాలని నిర్ణయించారు. దీనిపై ఆదేశాలు జారీకానున్నాయి. అలాగే, వీవోయే, ఆర్‌పీల పని బాధ్యతలపై కొద్దిరోజుల్లో విధివిధానాలు ఖరారు కానున్నాయి. ఈ ఏడాది రూ.14వేల కోట్ల మేర మహిళా సంఘాలకు రుణాలు అందించామని రిసోర్స్ పర్సన్స్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. మొత్తం రూ.52 వేల కోట్ల మేర ఆర్థిక సహాయాన్ని అందించి మహిళా సంఘాలను ప్రోత్సహించామని చెప్పారు. ప్రతి ఇంటికి బ్యాంకును తీసుకువెళ్లిన ఘనత ఏపీలోని మహిళాసంఘాలకే దక్కిందని అన్నారు.
50 శాతం జనాభాగా వున్న మహిళలు అభివృద్దిలో భాగం కావాల్సిన అవసరాన్ని ఆనాడే గుర్తించానని చెప్పారు. ఆర్థికంగా మహిళ శక్తిమంతురాలు అయినప్పుడే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావించానని, అందుకే ఆనాడు పొదుపు సంఘాలను ప్రోత్సహించానని, ఆనాడు ఏపీలో ప్రారంభించిన డ్వాక్రా సంఘాలు దేశంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగాయని గుర్తుచేశారు. ‘అప్పట్లో మహిళలు భుజానికి బ్యాగులు వేసుకుని తిరుగుతుంటే వెనక నుంచి మగవాళ్లు కామెంట్లు చేసేవారని అన్నారు. ఈ వ్యాఖ్యల్ని లక్ష్య పెట్టవద్దని మహిళలందరికీ చెప్పానన్నారు. వంటింట్లో పొగచూరుతో తన తల్లి పడుతున్న బాధను చూసి ‘దీపం’ పథకాన్ని ప్రవేశపెట్టానని చెప్పారు. ఈ పథకంతో ఇల్లాలు నిజంగానే ఇంటికి దీపంగా మారిందని, తరువాత సమాజంలో చైతన్యవంతమైన భూమిక పోషించిందని చెప్పారు.