కోస్తా ప్రజల చిరకాల స్వప్నం మరికొద్ది రోజుల్లో సాకారం కానుంది. పేద, మధ్య తరగతి వర్గాలకు కార్పొరేట్ సంస్థలను తలదన్నే వైద్య సేవలను అందించేందుకు విజయవాడ ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శరవేగంగా సిదమవుతోంది. నిర్మాణ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. చిన్న చిన్న పనులు, ఫినిషింగ్ పూర్తి చేసి త్వరలోనే ఇది ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా కాంట్రాక్టు సంస్థ కేఎంవీ గ్రూప్ పనులును పూర్తి చేస్తుంది.
ఈ ఆసుపత్రి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే అమరావతి రాజధాని ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం 293 పడకలతో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి రూపుదిద్దుకుంటోంది. రూ.150 కోట్ల వ్యయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రూ.120 కోట్ల నిధులను కేంద్రం కేటాయించగా రూ.30 కోట్లు ఏపీ ప్రభుత్వం కేటాయిస్తోంది. సూపర్ స్పెషాలిటీ విభాగంలో మొత్తం ఎనిమిది విభాగాల వైద్య సేవలు రోగులకు అందుబాటులోకి వస్తాయి.
గుండె, మెదడు, న్యూరాలజీ, నెప్రాలజీ, నవజాత శిశువు, మూత్రశయం వంటి విభాగాలు ఇక్కడ ఉంటాయి. ఇప్పటి వరకు ఈ విభాగాలకు సంబంధించిన రోగులు గుంటూరు, హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సూపర్ స్పెషాలిటీ అందుబాటులోకి వస్తే విజయవాడలోనే వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి.