జనసేన అధిపతి పవన్ కల్యాణ్ శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన సభలో ప్రసంగించారు. జగన్ లా నాకు ఎమ్మల్యేలు ఉంటే అసెంబ్లీని ఒక ఊపు ఊపేవాడిని అని అన్నారు (మరి 18 మంది ఎమ్మల్యేలను ఇస్తే ప్రజా రాజ్యం పార్టీ ఏమి చేసారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు). సీఎంను ఎదుర్కొనే దమ్ములేక, శక్తిలేక జగన్ పారిపోతున్నారు అని పవన్ అన్నారు (మొన్నటిదాకా చంద్రబాబుకు జగన్ అంటే భయం అన్నారు పవన్, ఈ రోజు జగన్ కి చంద్రబాబు అంటే భయం అంట). అంతే కాదు తన పై చేసిన వ్యక్తిగత విమర్శలకు కూడా సామాధానం చెప్పారు. నేను లెగిస్తే మనిషిని కాదు, గుండెల్లో అగ్ని గోళాలు పెట్టుకుని తిరుగుతున్నాను. నన్ను రెచ్చగొట్టకండి అంటూ జగన్ తో పాటు లోకేష్ ని కూడా కలిపి వార్నింగ్ ఇచ్చారు (మధ్యలో లోకేష్ ని ఎందుకు అన్నారా అని ప్రజలు జుట్టు పీక్కుంటున్నారు).
‘నా జీవితం తెరిచిన పుస్తకం. అరమరికలు లేవు. రహస్యాలు లేవు. అన్ని కోణాల నుంచి పరిశీలిస్తే నేనే ఉత్తముడి’నని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. నేను ఏదైనా ఓపెన్ గా చేస్తానని, అది తప్పో ఒప్పో చేసేస్తానని అన్నారు. కాని చాలా మందికి చీకటి కోణాలు ఉన్నాయని, నాకు అలాంటివి లేవని, పవన్ అన్నారు. ఇప్పుడున్న వారి అందరికంటే నేనే ఉత్తముడిని అని పవన్ అన్నారు. నాకంటే ఉత్తముడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయల్లో లేరని పవన్ అన్నారు. జనసేన ప్రశ్నించే స్థాయి నుంచి పాలించే స్థాయికి చేరుతుందని పవన్ అన్నారు.
‘‘అనుభవం కోసమే 2014 ఎన్నికల్లో పోటీచేయకుండా ఆగాను. 2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి... తగిన అనుభవం సాధించాను. 2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం’’ అని ప్రకటించారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా ఏ రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా తనపై ఇదే అభిమానం చూపిస్తున్నారని అన్నారు. బాంబులు, వేటకొడవళ్లు భయపెట్టలేవు. గుండె నిండా విప్లవం నింపిన ధైర్యం మాకుంది. జనసైనికుల అండ ఉంది, జనసేన విజయానికి నాంది ఇక్కడ నుంచే పడింది అంటూ, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మొత్తానికి చంద్రబాబు, లోకేష్ తో పాటు, రాష్ట్రంలో మిగతా నాయకుల కంటే, నేనే అత్యంత ఉత్తముడిని అని పవన్ స్వయం ప్రకటన చేసుకుని, ఇదే అందరికీ చెప్పమని జన సైనికులకి చెప్పారు.