ఎన్నికలకు ఏడాది ముందుగానే పెందుర్తిలో వేడి రేగుతోంది. బరిలో నిలిచేందుకు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఇప్పటినుంచే సన్నాహాలు మొదలపెట్టేశారు. కేడర్‌లో పట్టు సాధించేందుకు యత్నిస్తున్నారు. ఇందులో టీడీపీ నేత, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ముందున్నారు. విజయంలో కీలకం కీలకపాత్ర పోషించే పెందుర్తి మండలంలో పూర్తి స్థాయి ఆధిపత్యం దక్కేలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. పెందుర్తి లేదా సుజాతానగర్‌లో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా సన్నాహాలు జరుగుతున్నాయి.
నియోజకవర్గంలో పెందుర్తి, సబ్బవరం, పరవాడ, పెదగంట్యాడ మండలాలున్నాయి. ఇక్కడి అభ్యర్థులకు విజయావకాశాలను నిర్ణయించేది పెందుర్తి మండలమే. నియోజకవర్గంలో సుమారు 2.50 లక్షల మంది ఓటర్లుండగా పెదగంట్యాడ, పరవాడ, సబ్బవరం మండలాల్లో 1.25 లక్షల మంది ఓటర్లున్నారు. సగానికి పైగా ఓటర్లు పెందుర్తి మండలంలోనే ఉన్నారు. గత ఎన్నికల్లో బండారు విజయంలోనూ ఇక్కడి ఓటర్లే కీలకమయ్యారు. పెందుర్తి మండలంలో పెందుర్తి, చినముషిడివాడ, సుజాతానగర్, పురుషోత్తపురం, నాయుడుతోట, చీమలాపల్లి తదితర ప్రాంతాలలో టీడీపీ కార్యాలయాలున్నాయి. ఎమ్మెల్యే బండారు, అతని తనయుడు అప్పలనాయుడు ఈ కార్యాలయాల్లోనే కార్యకర్తలతో సమావేశాలు ఇతర వ్యవహారాలు చేస్తున్నారు.
గత ఎన్నికల్లో బండారు విజయానికి కృషి చేసిన ఆ ప్రాంత విద్యావేత్త ఇటీవల పవన్ సమక్షంలో జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకోవడం, రానున్న ఎన్నికలలో పెందుర్తి నుంచి పోటీకి సమాయత్తమవుతుండటం టీడీపీలో గుబులు రేపుతోంది. బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకులను జనసేన నేత కూడగట్టి మద్దతు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల పరిస్థితి మళ్లీ బండారుకు కలసివచ్చేనా అని చర్చించుకుంటున్నారు. ఈ మేరకు ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా బండారు వ్యూహ రచనలు చేస్తున్నారు.