తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తుంది కేంద్రం. స్పెషల్ ట్రీట్మెంట్ అంటే బాగా నిధులు ఇచ్చేసి, ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చటం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టటం. ప్రతి ఫైలునూ అవసరానికి మించి, అసాధారణ స్థాయిలో పరిశీలించడం, రాజకీయ కోణంలో ఆలోచించడం! ఇదే ఆ స్పెషల్ ట్రీట్మెంట్. రాష్ట్రాల నుంచి వచ్చే ఫైళ్లను ఢిల్లీ స్థాయిలో సాధారణ ప్రకియ్రలో భాగంగానే ఆమోదిస్తుంటారు. నిధుల విడుదల నుంచి, విధానాల వరకు సాధారణ ప్రక్రియలో భాగంగానే జరుగుతాయి. కానీ... రాష్ట్రం నుంచి వెళ్లిన ఫైళ్లపై మాత్రం ఢిల్లీలో ఆసక్తికర చర్చ జరుగుతోందని సమాచారం. ఈ ఫైలును ఏ కోణంలో చూడాలి? ఎంతవరకు సానుకూల నిర్ణయం తీసుకోవాలి? అనే కోణంలో ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు.
అదే సమయంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణంపైనా చర్చ జరుగుతోంది. ఇటీవలికాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం సంగతి ఎలా ఉన్నప్పటికీ... కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం ఢిల్లీలో కూర్చుని ప్రయత్నాలు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నారు. కేంద్రంలో ఏ పథకాల నుంచి నిధులు తెచ్చుకోవచ్చన్న దానిపైనా ఒక మోస్తరు పరిశోధన కూడా జరిగింది. ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులే స్వయంగా ఢిల్లీకి వెళ్లి నిధులు సాధించాలని సీఎం ఆదేశిస్తున్నారు. అలా వెళ్లిన సమయంలోనూ కేంద్ర అధికారులు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, బీజేపీ-టీడీపీ మధ్య ఎందుకు చెడింది, ఏపీకి రావాల్సింది ఏంటి, ఇంతవరకూ కేంద్రం చేసిందేమిటి... అంటూ వివరాలు ఆరా తీస్తున్నారు.
కేంద్రంతో విభేదించి ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న రాష్ట్రం ఏపీ ఒక్కటే అని పేర్కొంటున్నారు. రాజకీయ పరిణామాలు, ప్రభావాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఫైళ్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇది ఒక్కటే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి శాఖలో ఎక్కడన్నా అవినీతి జరిగిందా ? రూల్స్ కి వ్యతిరేకంగా ఏమన్నా చేసారా అనేది కూడా, కేంద్రంలోని కొంత మంది ప్రత్యేక శ్రద్ధతో చూస్తున్నారు. అయితే, చంద్రబాబు అవినీతి చేసాడు, త్వరలో చుక్కలు చూపిస్తాం, జైల్లో పెడతాం అని మొన్నటి దాక మాట్లాడిన బీజేపీ వాళ్ళు, గత నెల రోజుల నుంచి, ఈ విషయం మాట్లాడటం మానేశారు. ఎందుకంటే, వారికి ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఏది ఏమైనా, కేవలం రాజకీయం కోసం, ఇలా ఒక రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టటం ఏంటో, వారికే తెలియాలి.