రాజ్యసభ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టింది మొదలు తనదైన శైలిలో నూతన ఒరవడి కొనసాగిస్తున్న వెంకయ్యనాయుడు తాజాగా ఓ చిత్రమైన పరిస్థితి ఎదుర్కోనున్నట్టు కనిపిస్తోంది. అసోంకి చెందిన కాంగ్రెస్ సభ్యులంతా ఆయనపై ఆయనకే ఫిర్యాదు చేస్తూ లేఖ రాసేందుకు సిద్ధమయ్యారు. అసోం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఎన్‌ఆర్‌సీపై మాట్లాడేందుకు తగినంత సమయం కేటాయించడం లేదనీ... ‘‘చైర్మన్ మాకు అన్యాయం చేస్తున్నారని..’’ ఆరోపిస్తూ ఎంపీలు ఆయనకు లేఖ రాయనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. రాజ్యసభలో కాంగ్రెస్ సభాపక్ష నేత గులాం నబీ ఆజాద్ తుదినిర్ణయం తీసుకున్న తర్వాత ఈ లేఖను సంధించనున్నారు. దీనిపై మొత్తం ఐదుగురు ఎంపీలు సంతకాలు చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ వినూత్న నిరసనకు అసోంకి చెందిన మరో ఎంపీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
ఎన్ఆర్సీపై రాజ్యసభలో బీజేపీ చీఫ్ అమిత్ షా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన సమయంలోనే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ‘‘నాటి ప్రధాని రాజీవ్ గాంధీ సంతకం చేసిన అస్సాం ఒప్పందంలో భాగంగానే ఎన్‌ఆర్‌సీ అమలు చేస్తున్నామంటూ’’ బీజేపీ చీఫ్ వ్యాఖ్యానించారు. 2005లోనే ఎన్‌ఆర్సీ ప్రక్రియను కాంగ్రెస్ ప్రారంభించినప్పటికీ.. ‘‘బంగ్లాదేశీ అక్రమ వలసదారులను’’ దేశం నుంచి తరిమేందుకు కాంగ్రెస్‌కు ధైర్యం సరిపోలేదన్నారు. జాతీయ భద్రత, పౌరుల హక్కుల కంటే ఓటుబ్యాంకే ముఖ్యమని భావించబట్టే కాంగ్రెస్ దీనిని బుట్టదాఖలు చేసిందని అమిత్ షా ఆరోపించారు.
ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమిత్ షా క్షమాపణ చెప్పాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. అమిత్ షా ప్రసంగం ముగియక ముందే ప్రతిపక్షాలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నాయి. అయితే సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తే సహించేది లేదంటూ వెంకయ్యనాయుడు విపక్షాలను వారించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తమ పార్టీ చీఫ్ అమిత్‌షాను కాపాడుకునేందుకు బీజేపీ ఎంపీలంతా భుజం కలిపి నిలబడుతున్నారు. ఎన్‌ఆర్సీపై చర్చించేందుకు సమయం కేటాయించాలని కాంగ్రెస్ ఎంపీలు కోరినప్పటికీ వెంకయ్య అనుమతించలేదు. దీంతో అసోం కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలనే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు.