కాపు రిజర్వేషన్ల పై ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అందరూ కలిసి వక్రీకరించారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం పార్టీ కేంద్రం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా లబ్ది పొందాలని కొన్ని శక్తులు కుట్ర పన్నాయన్నారు. జగన్ వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకుని, తప్పు ప్రచారం చేస్తున్నారని అంబటి ఫైర్ అయ్యారు. కాపు రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేవని మాత్రమే తమ అధినేత వైఎస్ జగన్ చెప్పారని, కాపురిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ హామీ ఇస్తే వెనక్కి తీసుకునే ప్రసక్తిలేదని, కాపు రిజర్వేషన్లను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తునే ఉంటామన్నారు.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలు బాధాకరమని, కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి చంద్రబాబు ఏం చేశారని అంబటి ప్రశ్నించారు. కేంద్రంతో కలిసి చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని, జగన్ లాగ స్వచ్చంగా ఉండాలని అంబటి నీతి సూక్తులు చెప్పారు. కాపు ఉద్యమానికి అండగా ఉన్న పార్టీ వైఎస్సార్సీపీనే అని, ఈ అంశం గురించి మాట్లాడే నైతిక అర్హత ఎవరికీ లేదని అంబటి అన్నారు. ముద్రగడకు అండగా ఉన్న జగన్ ను, ఇప్పుడు ముద్రగడ ఇలా అనటం చాలా తప్పు అని, జగన్ ఎంతో కమిటెడ్ గా ఉన్నారని, అంబటి అన్నారు. జగన్ వ్యాఖ్యలు ఇలా వక్రీకరించి, ఇలా చెయ్యటం చాలా తప్పు అని అంబటి అన్నారు.
నిమ్మకాయల రాజప్ప విమర్శలు... కాపులకు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల రాజప్ప విమర్శలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేమని జగ్గంపేట సభలో జగన్ స్పష్టంగా చెప్పారని, ఇప్పుడు, అలా అనలేదని వైసీపీ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కాపులకు రిజర్వేషన్లు విషయంలో న్యాయం చేస్తానని జగన్ తో చెప్పించాలని ఆ పార్టీ నేతలను డిమాండ్ చేశారు. కాపులకు న్యాయం చేస్తామని చెప్పడానికి జగన్ కు ఉన్న ఇబ్బందేమిటీ? అని ప్రశ్నించారు. నాడు మంత్రి గా ఉన్న బొత్స సత్యనారాయణ కాపుల సర్వేకు రూ.40 లక్షలు కేటాయించలేకపోయారని విమర్శించారు.