'అధికారంలో ఎవరున్నారు? హామీ ఇచ్చిన వారిని వదిలేసి నన్ను అడగటం ఏమిటి?' అంటూ వైసిపి అధినేత జగన్ కాపు రిజర్వేషన్లపై తనను నిలదీసిన మహిళలను వెటకారంగా ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాల్లో ప్రజా సంకల్ప యాత్ర సోమవారం సాగింది. పిఠాపురం మండలంలోని విరవలో ఆ గ్రామానికి చెందిన కాపు మహిళలు తమ కులానికి రిజర్వేషన్లు ఎందుకివ్వరు అంటూ ప్రశ్నించారు. దీనిపై జగన్ వెటకారంగా స్పందిస్తూ... 'అధికారంలో ఎవరున్నారు?. హామీ ఇచ్చిన వారిని వదిలేసి నన్ను అడగటం ఏమిటి?' అంటూ సమాధానం దాటవేశారు.
స్పష్టంగా సమాధానం ఇవ్వకపోవడంతో మహిళలు నిరాశకు గురయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది సాయంతో యాత్రను కొనసాగించారు. కిర్లంపూడి మండలం వీరవరం నుంచి సోమవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించిన ఆయన పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి మీదుగా పిఠాపురం మండలం పాటి మీద, మల్లం రోడ్డు, విరవ వరకూ నిర్వహించారు. అనంతరం విరవ పిహెచ్‌సి సమీపంలో రాత్రి బస చేశారు. సినీనటుడు విజయచంద్ర పాదయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
శనివారం జగ్గంపేటలో పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో జగన్ మాట్లాడుతే కాపు రిజర్వేషన్లపై తన వైఖరిని స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్ అంశం రాష్ట్ర పరిధిలోని అంశం కాదని, అందుకే తాను మాట ఇవ్వలేనన్నారు. తాను మాటిచ్చి తప్పలేనని, చేయగలిగే వాటికే తాను హామీ ఇస్తానన్నారు. రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దని సుప్రీం కోర్టు చెప్పిందని జగన్ గుర్తు చేశారు. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాపు రిజర్వేషన్ల అంశంలో జగన్ యూటర్న్ తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులను ఆయన అవమానించారని, కాపులకేనా.. మొత్తం రిజర్వేషన్లకు జగన్ వ్యతిరేకమా అంటూ ప్రశ్నించారు.