5 కోట్ల మంది మీ వైపు చూస్తున్నారు... వారి తరుపున పోరాడాల్సింది మీరే... మీ పోరాటాన్ని తక్కువ చేసే కుట్రలు జరుగుతాయి.. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండండి... మిమ్మల్ని సస్పెండ్ చేస్తారనే సమాచారం కూడా ఉంది... ఏ పరిణామాకైనా సిద్ధంగా ఉండండి... మీ పై కుట్రలు చేసి, మీ పోరాటాన్ని నీరు గారుస్తారు, ప్రతి క్షణం అలెర్ట్ గా ఉండండి... ఒక లక్ష్యం కోసం చేస్తున్న పోరాటానికి అందరి మద్దతు కూడగట్టండి అంటూ, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సభ నుంచి సస్పెండ్ చేసినా వెనుకంజ వేయొద్దని.. ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రం కోసం పోరాటం కొనసాగించాలని తేల్చిచెప్పారు. తాను దిల్లీ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటానని చెప్పారు.
రాష్ట్ర ప్రయోజనాలపై రాజీలేని పోరాటం చేయాలని, విభజన చట్టంలో అంశాల అమలుకు ఒత్తిడి చేయాలని అన్నారు. ప్రధాని హామీలు ఎందుకు అమలు చేయరని సభా సాక్షిగా నిలదీయాలని ఆదేశించారు. పోరాటం తమకు కొత్తేమీ కాదని, అన్యాయాన్ని చక్కదిద్దుతామని ఆనాడు బీజేపీ చెప్పిందని, ఇప్పుడు బీజేపీ నేతలే అన్యాయం చేస్తున్నారన్నారు. ఇది నమ్మిన వారిని మోసగించడం కాదా అని అన్నారు. ప్రజాకోర్టులో దోషులుగా నిలబెట్టాలన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోయే ప్రమాదం వచ్చిందన్నారు. ఎంపీలు సమన్వయంతో పనిచేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. లాలూచీ రాజకీయాలను ఎండగట్టాలన్నారు. కావాల్సిన సమాచారం ఇవ్వడానికి అధికార యంత్రాంగం సిద్దంగా ఉందని, ఎంపీలు దానిని సమర్ధంగా వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై ఎంపీలు తోటనర్సింహం, కేశినేని నాని అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు. అయితే ఈ తీర్మానంపై ఈరోజు పార్లమెంటులో చర్చ జరుగుతుందా లేదా అనే సందిగ్దత నెలకొంది. తీర్మానానికి మద్దతు ఇచ్చేందుకు 150 మంది సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఎంపీలు చెబుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని పార్టీల నేతలతో ఇప్పటికే టీడీపీ ఎంపీలు బృందాలుగా ఏర్పడి భేటీ అయిన విషయం తెలిసిందే. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ మద్దతు కోరగా ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. చంద్రబాబు తమ మద్దతు ఉంటుందని లాలూ హామీ ఇచ్చారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే.