ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలవడానికి కాంగ్రెసు నేత శైలజానాథ్ అమరావతి వచ్చారు. శైలజానాథ్ బుధవారం ఉదయం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. వారి మధ్య భేటీ కొంచెం సేపు జరిగింది. దాదాపు పది నిమిషాల పాటు సీఎంతో శైలజానాథ్ చర్చలు జరిపారు. అనంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లపై సీఎంతో చర్చించానని తెలిపారు. ఎన్టీఆర్ వైద్యసేవా పథకం హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో అమలు కావడంలేదని సీఎం దృష్టికి తీసుకొచ్చానని శైలజానాథ్ చెప్పారు.
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో వారి భేటీకి ప్రాధాన్యం చేకూరింది. ఇటీవల మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చంద్రబాబును కలిశారు. ప్రస్తుతం ఏ పార్టీలో లేనని అరుణ్ కుమార్ చెబుతున్నప్పటికీ గతంలో కాంగ్రెసు పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ తో పాటు కాంగ్రెసు నేత శైలజానాథ్ రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. పార్లమెంటులో తెలుగుదేశం మోడీ ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధపడిన నేపథ్యంలో చంద్రబాబుతో శైలజానాథ్ భేటీ పాధాన్యత సంతరించుకుంది.
గతంలో తెలుగుదేశం పార్టీలోకి రావడానికి శైలజానాథ్ ప్రయత్నించినట్లు చెబుతారు. అయితే, ఆ ప్రయత్నం ఫలించలేదు. రెండు రోజుల క్రితం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సందర్భంలో, జగన్ పై తీవ్ర విమర్శలు చేసారు. ఓ పెద్ద మనిషి కుటుంబానికి కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్తునిస్తే... ఆయన తనయుడు కాంగ్రెస్‌ను ఖాళీ చేసి సొంత పార్టీ పెట్టుకున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కుదరదని కేంద్రం అఫిడవిట్ వేస్తే... బీజేపీని జగన్, పవన్ పల్లెత్తు మాట కూడా అనడం లేదని ఆయన మండిపడ్డారు.