శ్రీరాముడు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్‌కు హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ విధించిన సంగతి తెలిసిందే. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఓ వర్గం వారి మనోభావాలను దెబ్బ తీస్తుండటంతో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ పోలీసు. ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధించిన అధికారులు, ఇతన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పగిస్తున్నామని హైదరాబాద్ పోలీస్, మీడియాతో చెప్పారు. అతను హైదరాబాద్ తిరిగి రావటానికి వీలు లేదని చెప్పారు. అయితే, అతన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకురావటం పై, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అభ్యంతరం చెప్పటంతో, కత్తి మహేష్ ను పోలీసులు కర్ణాటకలో విడిచిపెట్టినట్టు సమాచారం. అయితే, కత్తి అనూహ్యంగా ఈ రోజు చిత్తూర్ జిల్లాలో ప్రత్యక్షం అయ్యారు.
ఈ రోజు కత్తి మహేష్ పీలేరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు యత్నించగా. అక్కడి పోలీసులు కత్తి మహేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మళ్ళీ ఏమన్నా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, ఏమన్నా శాంతి బధ్రతల సమస్య లేపుతారేమో అని, పోలీసులు ముందుగానే అరెస్ట్ చేసారు. అనంతరం ఆయనను పీలేరు నుంచి మదనపల్లెకు తరలించారు. అక్కడి నుంచి మహేశ్‌ను మళ్ళీ బెంగళూరుకు తరలించనున్నట్టు సమాచారం. కావాలని ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి కుట్రలు పన్నే అవకాశం ఉందని, ముందునుంచే పోలీసులకి సమాచారం ఉండటంతో, ఇలాంటి వారికి ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా, ముందుగానే రియాక్ట్ అయ్యి, కత్తి మహేష్ ను అక్కడ నుంచి తరలించారు. మొత్తానికి కత్తి మహేష్ ను, అటు తెలంగాణా పోలీసు, ఇటు ఆంధ్రా పోలీసు ఫుట్ బాల్ ఆడుకుంటూ, అటూ ఇటూ పడేస్తున్నారు.
కత్తి మహేశ్ భావవ్యక్తీకరణ పేరుతో టీవీ ఛానళ్లను వేదికగా చేసుకుని మెజార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా కొన్ని హిందూ ధార్మిక సంస్థలు తీవ్రంగా స్పందించాయి. భావ వ్యక్తీకరణ అనేది ప్రాథమిక హక్కు అయినప్పటికీ.. దానివల్ల సమాజంలోని ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించాలి. అయితే హైదరాబాద్ పోలీసులు అక్కడ శిక్షలు వెయ్యకుండా, అతన్ని ఆంధ్రాలో తీసుకొచ్చి పడేయటం వెనుక, రాజకీయ కుట్ర లేకపోలేదని పోలీసు వర్గాలు కూడా భావిస్తున్నాయి. అతని మీద చర్యలు తీసుకునేలా ఆంధ్రప్రదేశ్ మీద ఒత్తిడి తేవటం, చర్యలు తీసుకుంటే ఒకలా, తీసుకోకుంటే ఒకలా, ఆందోళన చెయ్యటానికి కుట్ర పన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఆంధ్రా పోలీసులు ఈ తలనొప్పి మాకెందుకని, కత్తి మహేష్ ను మన రాష్ట్రంలో ఏ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యకుండా అడ్డుకున్నారు.