నవ్యాంధ్ర ప్రయాణం మొదలు కాక ముందు రాష్ట్రంలోని ఎయిర్ పోర్ట్ ల సంగతి ఎలా ఉండేదో అందరికీ తెలిసిందే. అమరావతి రాజధాని అవ్వటం, పరిపాలన మొదట్లో విజయవాడ నుంచి, తరువాత వెలగపూడి నుంచి మొదలు కావటంతో గన్నవరం ఎయిర్ పోర్ట్ చాలా కీలకంగా మారింది. దీంతో అప్పట్లో కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రిగా ఉన్న మన రాష్ట్ర బిడ్డ అశోక్‌గజపతిరాజు అన్ని విధాలుగా సహకరించారు. విమానాశ్రయంలోని పాత టెర్మినల్ భవనాన్ని రూ.2.50 కోట్లు వెచ్చించి రెండు నెలల్లోనే అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దారు. కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ విభాగాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను జారీ చేశారు. గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించారు. మరో పక్క రన్‌వే విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో అంతర్జాతీయ హోదా ప్రకటన వెలువడిన మూడు, నాలుగు నెలల్లో అంతర్జాతీయ విమానాలు గన్నవరం నుంచి ప్రారంభం కాబోతున్నాయి అని అందరు అనుకున్నారు.
తరువాత ఎన్డీఏ నుంచి తెలుగుదేశం బయటకు రావటం, కేంద్ర మంత్రి పదవికి అశోక్‌గజపతిరాజు రాజీనామా చెయ్యటంతో, ఇక కష్టాలు మొదలయ్యాయి. మన గోడు వినే వారే లేకుండా పోయారు. అంతర్జాతీయ విమాన సర్వీస్ ల కోసం, కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ విభాగాలు సిద్ధం చేసారు కడు. టెర్మినల్ భవనంలో భద్రతకు అవసరమైన సీసీ కెమెరాలు, ఆర్చ్‌వే మెటల్ డిటెక్టర్లు, మూడంచెల భద్రతా వ్యవస్థలను సిద్ధం చేశారు. ఇమ్మిగ్రేషన్ సేవలు అందించేందుకు రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన సిబ్బందికి శిక్షణ అందించారు... ఇలా అన్నింటినీ విమానాశ్రయంలో సిద్ధం చేశారు. అయితే, కేంద్రం నుంచి మాత్రం ఎలాంటి సహకారం రావటం లేదు.
గన్నవరం నుంచి విదేశీ విమానాలు నడిపేందుకు కేంద్రం చొరవ తగ్గడంతో ప్రజల విజ్ఞప్తి పై రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నా అవి కేంద్రం పట్టించుకోవటం లేదు. కనీసం సింగపూర్, దుబాయ్ లాంటి దేశాలకైనా విమాన సర్వీసులను వారానికి ఒకటి రెండు నడపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని వేడుకుంటున్నా, ఏవేవో నిబంధనలు చెప్తున్నారు. దుబాయ్ కు ఎయిర్ ఇండియా విమానం వస్తుంది అని చెప్పారు, ద్వైపాక్షిక ఒప్పందాలలో నిబంధనలు కుదరటం లేదు అంటూ దాన్ని ఒప్పుకోలేదు. సింగపూర్‌కు చెందిన సిల్క్ ఎయిర్వేస్ మొదట ముందుకొచ్చినా కేంద్ర పౌరవిమానయానశాఖ నిబంధనలు అవరోధమయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, వయబిలిటీ గ్యాప్ ఫండ్ మేము ఇస్తాం, కనీసం చార్టర్డ్ విమానాన్ని, సింగపూర్-విజయవాడ మధ్య నడపమంటున్నా, కేంద్రం నిబంధనలు చూపించి, కుదరదు అని చెప్తుంది. ఇలా అశోక్‌గజపతిరాజు రాజీనామా చేసిన దగ్గర నుంచి, అన్నీ ఇబ్బందులే ఎదురవుతున్నాయి.