తిరుమల మహాసంప్రోక్షణ వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. మహాసంప్రోక్షణ విషయంలో గతంలో పాటించిన నిబంధనలే అమలు చేయాలని సీఎం చంద్రబాబు టీటీడీకి ఆదేశించారు. మహాసంప్రోక్షణ సమయంలోనూ భక్తులను దర్శనానికి అనుమతించాలని చంద్రబాబు సూచించారు. గతంలో మహా సంప్రోక్షణలో పాటించిన నిబంధనలను అనుసరించాలని తెలిపారు. మహాసంప్రోక్షణ సందర్భంగా ఆరు రోజుల పాటు భక్తుల దర్శనాలు నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై జరుగుతున్న వివాదంపై స్పందించిన చంద్రబాబు భక్తులకు ఇబ్బంది కలిగేలా నిర్ణయాలు ఉండొద్దని టీటీడీకి సూచించారు. రోజుల తరబడి భక్తులు ఎదురుచూసేలా చేయొద్దన్నారు. ఆగమ శాస్త్ర ప్రకారమే పూజాకైంకర్యాలు జరగాలన్నారు.
మహాసంప్రోక్షణ క్రతువు ఉన్నందున 9 రోజుల పాటు శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 9వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి ఆగస్టు 17 ఉదయం 6 గంటల వరకు వెంకన్న దర్శనానికి భక్తులను అనుమతించకూడదని ఈరోజు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో 12ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహా సంప్రోక్షణ పై టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజూ తిరుమలకు వచ్చే వారి సంఖ్య లక్షకు పైగా చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చెబుతోంది. ఒకవేళ పరిమితంగా అనుమతించినా రోజుకు 20వేల మందికి మాత్రమే దర్శనం అవకాశం కలుగుతుందని మిగిలిన వారు క్యూలైన్లలో వేచి ఉండాల్సి ఉంటుందని అంటోంది.
అయితే, ఇలాంటి అవకాశం కోసం కాచుకుని కూర్చున్న జగన్ బ్యాచ్, బీజేపీ బ్యాచ్, రెండు రోజుల నుంచి రచ్చ రచ్చ చేస్తున్నాయి. తిరుమలలో తవ్వకాలు జరుపుతున్నారు అని, స్వామి వారి నగలు తరలిస్తున్నారని, ఇలా ఇష్టం వచ్చినట్టు ప్రచారం మొదలు పెట్టారు. ఆ సమయంలో స్వామి వారికి పూజలు చేస్తారు అని చెప్పినా వినకుండా, బ్రహ్మం గారు చెప్పారు, గుడి మూసేస్తారు అని, ఇప్పుడు చంద్రబాబు అలాగే చేస్తున్నారు అంటూ, హడావిడి చేసారు. దీంతో సామాన్య భక్తులకు కూడా అనుమానాలు మొదలయ్యాయి. తిరుమల ప్రతి ఒక్కరికి అవినాభావ సంబంధం ఉండటంతో, ఇలాంటి వాటికి కనెక్ట్ అయిపోతారు. అందుకే చంద్రబాబు వెంటనే ఈ విషయం పై స్పందించారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినకూడదు అని, తిరుమల పవిత్రతని నాశనం చేసే పన్నాగాలు చేస్తున్నారని, వారికి అవకాశం ఇవ్వకూడదు అని, గతంలో మహా సంప్రోక్షణలో పాటించిన నిబంధనలను అనుసరించాలని, ఎంత మందికి దర్శనం వీలు అయితే అంత మందికి దర్శనం చేపించాలని సూచించారు..