పార్లమెంట్ సెంట్రల్ హాల్ దగ్గర తెలుగుదేశం పార్టీ ఎంపీలను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిశారు. కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి మంచి పనిచేశారని ఆమె కొనియాడారు. టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు ప్రసంగానికి ఆమె ప్రశంసలు తెలిపారు. ఎంపీ కేశినేని నానిని మమత ప్రత్యేకంగా అభినందించారు. అలాగే బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీతో భేటీ అయ్యారు. దాదాపు ఇరవై నిమిషాలు ఆయనతో మాట్లాడారు. తాను అద్వానీని కలిసి ఆయన ఆరోగ్యంపై వాకబు చేశానని ఆమె చెప్పారు. తరువాత సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, దేవేగౌడను, అరవింద్ కేజ్రీవాల్‌లను కూడా ఆమె కలిసారు. ఢిల్లీలో మూడు రోజుల పాటు ఉంటున్న ఆమె రాజకీయ నేతలతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అలాగే, సీఎం చంద్రబాబుకు బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆహ్వానం పంపారు. ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెలలో ఢిల్లీలో నిర్వహించే ర్యాలీలో పాల్గొనాలని కోరారు. 2019 ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని విపక్షాలు సమష్టిగా ఎదుర్కోవాలని మమతా అన్నారు. ప్రతిపాదిత కూటమి తమ ప్రధాన మంత్రి అభ్యర్థి పేరును ముందుగా వెల్లడించకూడదన్నారు. విపక్షాల ఐక్యతను తెలిపేందుకు జనవరి 19న కోల్‌కతాలో చేపట్టే భారీ ర్యాలీలో పాల్గొనాలని విపక్ష నేతలను కలుస్తున్నట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడనికి విపక్షాల సమష్టి నాయకత్వం అవసరమని, అందుకే నేను విపక్ష నేతలను కలిసి వారిని ర్యాలీకి ఆహ్వానిస్తానని చెప్పారు.
బీజేపీ చేస్తోన్న రాజకీయాలను తాము ఏమాత్రం సహించేది లేదన్నారు. దేశం మార్పును కోరుకుంటోందన్నారు. అది 2019లో జరిగితీరుతుందన్నారు. బీజేపీ జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఉత్తర ప్రదేశ్‌లో విభజన రాజకీయాలను చేయగలదని, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో వారి ఆటలు సాగవన్నారు. బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో విపక్షాలు అధికారంలో ఉన్నాయి కాబట్టి వారి ఆటలు సాగవన్నారు. ఏపీలో చంద్రబాబు, కర్ణాటకలో చంద్రబాబు ఉన్నందు వల్ల వారి ఆటలు సాగవన్నారు.