నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికీ నెలకు రూ.1000 ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. ఈ పథకానికి ‘ముఖ్యమంత్రి -యువనేస్తం’ అని నామకరణం చేశామన్నారు. ఆగస్టు 3 లేదా 4న నిరుద్యోగుల నమోదు ప్రక్రియ ఆరంభం అవుతుందని తెలిపారు. ప్రజా సాధికార సర్వేలాగా ఈ కేవైసీ జరుగుతుందన్నారు. 22 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులకు భృతి అందజేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం అందజేస్తున్న సామాజిక పింఛన్‌లకు ఎలాంటి ప్రాధాన్యం ఉంటుందో దీనికీ అంతే ఉంటుందన్నారు.
15 రోజుల్లో నమోదు.. కుటుంబంలో ఒక్క వ్యక్తికే పింఛన్ ఇస్తున్నామని నిరుద్యోగ భృతిని మాత్రం కుటుంబంలో ఎంతమంది నిరుద్యోగులుంటే అంతమందికీ రూ.1000 ప్రతినెలా ఇస్తామన్నారు. యువతీ, యువకుల ఆన్‌లైన్‌పై పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి నమోదు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్లో నిర్వహిస్తామన్నారు. ఆధార్ సంఖ్యను అనుసంధానం చేస్తామన్నారు. నమోదు ప్రక్రియ ముగిసిన 15 రోజుల తర్వాత బ్యాంకు ఖాతాల్లో భృతి జమ అవుతుందన్నారు. ‘ముఖ్యమంత్రి - యువనేస్తం’ పూర్తిగా పారదర్శకంగా కొనసాగుతుందన్నారు.
ప్రతి నెలా రూ.600 కోట్లు.. గతంలో నిర్వహించిన ప్రజా సాధికార సర్వే ప్రకారం రాష్ట్రంలో 12 లక్షల నిరుద్యోగులు ఉన్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. డిగ్రీ లేదా పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారికి భృతి అందుతుందన్నారు. ఈ పథకం అమలు చేసేందుకు ప్రతి నెలా రూ.600 కోట్లు ఖర్చవుతుందని ఏడాదికి దాదాపు రూ.8,000 కోట్లు అవుతుందని తెలిపారు. రాష్ట్రం లోటులో ఉన్నా, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అమలు చేసేందుకు నిర్ణయించామన్నారు. ప్రస్తుతం ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోకి వచ్చిన వారు ఈ పథకానికి అర్హులు కాదన్నారు. నిరుద్యోగ భృతి అందించడంతో పాటు యువతీ యువకులకు అవసరమైన ఉద్యోగ నైపుణ్యాల్లో శిక్షణ కల్పిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ పథకాలను సమ్మిళితం చేసి శిక్షణ అందిస్తామన్నారు.