ఏపీలో కాపు రిజర్వేషన్ అంశం... ఎన్ని ఉద్రిక్తతల్ని రాజేసిందో తెలుసు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. దీనిపై కేంద్రం నుంచి ఇంకా నిర్ణయం రాలేదు. కానీ ఇంతలోనే కాపు రిజర్వేషన్ల అంశంపై కాక రేపారు విపక్ష నేత జగన్. కాపు రిజర్వేషన్ల డిమాండ్‌తో ఉద్యమానికి పురిటిగడ్డగా నిలిచింది తూర్పుగోదావరి జిల్లా. జగ్గంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల కోసం పోరాడారు. అలాంటి జిల్లాకు, అందునా జగ్గంపేటకొచ్చి మరీ కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని తేల్చేశారు వైసీపీ అధినేత. జగన్ కాపుల పై చేసిన ప్రకటనలు, పవన్ కళ్యాణ్ ఏది స్పష్టంగా చెప్పకోవటం, తెలుగుదేశం బిల్ పెట్టి కేంద్రానికి పంపించటం, వీటన్నిటి పై ముద్రగడ తన అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం స్వగృహంలో బుధవారం తూర్పు, పశ్చిమ, విశాఖ జిల్లాల కాపు జేఏసీల సంఘం రహస్య సమావేశం నిర్వహించుకున్నారు. రాష్ట్ర పరిధిలో లేనివి మేము చేయలేమని చెబుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే ఈ సమావేశానికి మీడియాను అనుమతించలేదు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కాపులను బీసీల్లో చేర్చినట్టు ప్రకటించిన నేటికి కేంద్రం, సుప్రీంకోర్టు పరిధిలో ఉండిపోయిందంటూ ఎవరికివారు తమ యుక్తులు పదర్శిస్తూ కాలక్షేపం చేస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు చిత్తశుద్ధితో ముందుకొచ్చేవారికే 2019 ఎన్నికల్లో తాము మద్దతిస్తామని ముద్రగడ తెలిపినట్టు సమాచారం.. ఎక్కడైనా మీడియా ప్రశ్నిస్తే బీసీల్లో చేర్చడానికి ఎవరు ముందు కొస్తారో వారికే మద్దతిస్తామని తెలపాలని సమావేశంలో సంఘ నాయకులకు సూచించినట్టు తెలిసింది. ఎవరుకు వారు పత్రికలతో ఇష్టాసారంగా ప్రకటనలు చేయవద్దని ఈ రహస్య భేటీలో తెలుపుకున్నట్టు సమాచారం. ఒక్కోచోట ఒక్కోలా మాట్లాడుతూ కాపు రిజర్వేషన్‌పై ఎవరికీ చిత్తశుద్ధిలేనట్టుగా తెలుస్తోంది.. స్పష్టమైన ప్రకటన చేసిన వారికే మద్దతు ఇవ్వాలంటూ చర్చించుకున్నట్టుగా తెలిసింది. ఈ భేటీలో ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు,వాసురెడ్డి ఏసు దాసు, తుమ్మలపల్లి రమేష్, కలవకొలను తాతాజి, తోట రాజేష్, ఆలేటి ప్రకాష్, స్వామి పాల్గొన్నట్టు సమాచారం.